తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ధీటుగా బదులిచ్చారు.
తన కెరీర్‌లో ట్రంప్ లాంటి వారెంతో మంది నేరస్థులతో వ్యవహరించినట్లు కమలా హారిస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవకముందు గతంలో అటార్నీ జనరల్, డిస్ట్రిక్ట్ అటర్నీ, కోర్టు ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.
‘ట్రంప్ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ప్రవర్తననే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’ అని వ్యాఖ్యానించారు.
Throughout my career, I’ve taken on perpetrators of all kinds, and let me tell you: I know Donald Trump’s type. pic.twitter.com/EP9e8ClVKE
— Kamala Harris (@KamalaHarris) August 1, 2024
కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై జాతీపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆమె భారతీయురాలా?.. లేక నల్లజాతీయురాలా?’అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. ఇన్నాళ్లూ దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు.
ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
కాగా కమలా హారిస్ భారత సంతతికి చెందినవారన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్. ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. అయతే కమలా నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు..
Comments
Please login to add a commentAdd a comment