వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఆధిపత్యంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్‌నకు 47 శాతం, హారీస్‌కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో, ట్రంప్ లీడ్‌లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్‌పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్‌కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్‌పింగ్ గేమ్ ఆడుకుంటారని సెటైర్లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment