ప్రతిభావంతుల వలసలకు ఓకే! | Donald Trump condemns Srinivas Kuchibhotla's killing, pitches merit-based immigration | Sakshi
Sakshi News home page

ప్రతిభావంతుల వలసలకు ఓకే!

Published Thu, Mar 2 2017 1:05 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ప్రతిభావంతుల వలసలకు ఓకే! - Sakshi

ప్రతిభావంతుల వలసలకు ఓకే!

మెరిట్‌ ఆధారిత వలస విధానం
కెనడా, ఆస్ట్రేలియా తరహాలో అమలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడి.. కాంగ్రెస్‌నుద్దేశించి తొలి ప్రసంగం


వాషింగ్టన్‌: వలస విధానంపై పునరాలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రతిభ ఆధారిత వలసల విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా భారత్‌ వంటి దేశాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణులకు మేలు జరుగుతుంది. అధ్యక్షుడిగా కాంగ్రెస్‌నుద్దేశించి (అమెరికన్‌ కాంగ్రెస్‌ సంయుక్త సమావేశం) మంగళవారం రాత్రి తొలిసారి ప్రసంగించిన ట్రంప్‌.. ‘కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిభ ఆధారిత వలసల వ్యవస్థ అమల్లో ఉంది. ఇప్పుడున్న తక్కువ నైపుణ్య వలసల విధానం నుంచి ప్రతిభ ఆధారిత వ్యవస్థకు మారటం వల్ల ఎన్నో లాభాలున్నాయి.

ఈ విధానం కార్మికుల వేతనాలను పెంచటం ద్వారా వెనుకబడిన వర్గాలు మధ్యతరగతి వర్గంలోకి వచ్చేందుకు దోహదపడుతుంది’ అని ట్రంప్‌ వెల్లడించారు. ఈ అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. లక్షలకొద్ది ఉద్యోగాలను తిరిగి తీసుకొస్తానని భరోసా ఇచ్చిన ట్రంప్‌.. న్యాయమైన వలసల్లో సంస్కరణలు తీసుకురావటం ద్వారా అమెరికన్‌ వర్కర్లకు ఉద్యోగభద్రత ఇవ్వగలమన్నారు. ప్రస్తుత వ్యవస్థ ద్వారా పేద వర్కర్లకు వేతనాలివ్వకపోవటంతోపాటు పన్నుకట్టేవారిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని ట్రంప్‌ తెలిపారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి పనిచేయటం ద్వారా వలసల విధానంతోపాటు మరెన్నో సమస్యలను పరిష్కారం తీసుకురావొచ్చన్నారు.

‘మన అమెరికా’ అనే భావనను పెంచటం ద్వారా రోజూవారి సవాళ్లకు సరైన పరిష్కారం లభిస్తుందని ట్రంప్‌ వెల్లడించారు. గత ప్రభుత్వా లు తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా పరిశ్రమలతోపాటు ఇతర రంగాల్లో చాలా వెనకబడిందన్నారు. చైనా 2001లో డబ్ల్యూటీవోలోచేరిన తర్వాత, నాఫ్తా (ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) అమల్లోకి వచ్చాక దాదాపు 60 వేల ఉద్యోగాలను అమెరికా కోల్పోయిన విషయాన్ని ట్రంప్‌ సభకు గుర్తుచేశారు. దేశంలో 4.3 కోట్ల మంది పేదరికంలో ఉంటే... మరో 4.3 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే ఫుడ్‌ స్టాంపులపై ఆధారపడుతున్నారని ట్రంప్‌ వెల్లడించారు.

అవినీతిని సహించం
‘ప్రభుత్వంలో అవినీతిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాం. ఉన్నతాధికారులు తప్పుచేస్తే ఐదేళ్ల నిషేధం, విదేశీ ప్రభుత్వానికి ఎవరైనా లాబీయిం గ్‌ చేస్తే.. జీవితకాల నిషేధం విధిస్తున్నాం’ అని ట్రంప్‌ చెప్పారు.  కేర్‌ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్యబీమానే ప్రతి అమెరికన్‌ తప్పనిసరిగా తీసుకోవాలనేది (ఒబామా) అమెరికా విధానాలకు సరిపోదని, తమ ప్రభుత్వం తక్కువ ధరకు బీమా అందుబాటులో ఉండేలా మార్పులు చేస్తోందన్నారు.  విదేశాల్లో మౌలిక వసతులపై లక్షల కోట్ల డాలర్లను అమెరికా వెచ్చించిందని.. స్వదేశంలో మౌలిక వసతులను విస్మరించిందన్నారు. అమెరికాకు దాదాపు 800 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటుందని ట్రంప్‌ గుర్తుచేశారు. స్వేచ్ఛావాణిజ్యం ఉండాలని అయితే  సముచితంగా ఉంటే బాగుంటుందన్నారు.

దేశంలో పన్ను కటుడున్న వారిపైనే ఎక్కువ భారం పడుతుందని.. దీన్ని తగ్గించేందుకు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ట్రంప్‌ తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రసంగానికి ముందు న్యూస్‌ యాంకర్స్‌తో జరిగిన భోజన సమావేశంలోనూ వలసలపై ఇరువైపులా రాజీధోరణి అవసరమన్నారు. వలసల చట్టంలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్న ట్రంప్‌.. దీని ద్వారా అమెరికాలో అక్రమంగా ఉంటున్న కొందరికి చట్టబద్ధత ఇవ్వటంతోపాటు చిన్నతనంలో చట్టవ్యతిరేకంగా ఇక్కడికి తల్లిదండ్రులతోపాటు వచ్చిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ట్రంప్‌ ప్రసంగంపై 30 లక్షల మంది ట్వీట్ల ద్వారా స్పందించారు.

‘నల్ల’ జాతీయులకు ట్రంప్‌ కానుక
అమెరికాలోని చరిత్రాత్మక నల్లజాతీయుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల (హెచ్‌బీసీయూ)కు మేలుచేసే ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలపై ట్రంప్‌ సంతకం చేశారు. ఈ సంతకం ద్వారా వచ్చే ఫెడరల్‌ బడ్జెట్‌లో ఈ హెచ్‌బీసీయూల బలోపేతానికి భారీ బడ్జెట్‌ వస్తుందని ఈ కాలేజీల ప్రెసిడెంట్లు భావిస్తున్నారు. ఒబామా హయాంలో హెచ్‌బీసీయూలకు ఏడేళ్లలో 4 బిలియన్‌ డాలర్ల నిధులొస్తే.. ట్రంప్‌ దీన్ని 25 బిలియన్‌ డాలర్లకు పెంచుతారని ఆశిస్తున్నారు. ‘దేశంలోని 100 హెచ్‌బీసీయూలు తిరిగి సమర్థవంతంగా పనిచేసేందుకు కనీసం 25 బిలియన్‌ డాలర్లు కావాలని అధ్యక్షుడిని కోరాం. అందుకు ఆయన సానుకూలం గా స్పందించారు’ అని ఈ కాలేజీల ప్రతినిధులు తెలిపారు.

‘కాన్సస్‌’పై అమెరికాకు స్పష్టత ఉంది: భారత్‌
భారత ఇంజనీర్‌పై కాల్పుల ఘటపై అమెరికా అనుసరిస్తున్న వ్యూహం స్పష్టంగా ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి భద్రతే మన ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. అమెరికా అధ్యక్షుడు కూడా ఈ ఘటనను ఖండించారు. అమెరికాలో భారతీయుల భద్రతకు కావాల్సిన అన్ని చర్యలపై మేం దృష్టిసారించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్‌ బాగ్లే వెల్లడించారు.

వివాదాస్పద నిర్ణయాలు, పనితీరుతో ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వాటిపై కాంగ్రెస్‌ వేదికగా స్పందించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి అమెరికన్‌ కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగిస్తూ.. తన విధానాలపై వస్తున్న విమర్శలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దాదాపు గంట పాటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్‌.. వలస విధానంపై తన అభిప్రాయాలను, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాలను, అమెరికాను మళ్లీ గ్రేట్‌గా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. తన విధానాల్లో లోపాలేవీ లేవని తేల్చి చెప్పారు. నిమ్న నైపుణ్య ఆధారిత వలస వ్యవస్థ అమెరికాకు మంచిది కాదని, ఆ వ్యవస్థ స్థానంలో.. ప్రతిభ ఆధారిత వలస విధానం అవసరమని నొక్కి చెప్పారు. కెనడా, ఆస్ట్రేలియాల్లో అదే విధానం అమల్లో ఉందని, తాను కూడా ఆ దిశగానే ముందుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు ఇంజినీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యపై స్పందిస్తూ.. ‘కాన్సస్‌ కాల్పులు దురదృష్టకరమ’ని వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ స్పీచ్‌తో అమెరికన్లు హ్యాపీ
అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన మొదటి ప్రసంగం తమలో ఆశావాదాన్ని నింపిందని..ప్రసంగం చూసిన ప్రతి పదిమంది అమెరికన్లలో ఏడుగురు చెప్పారు. సీఎన్‌ఎన్‌/ఓఆర్‌సీ చేసిన పోల్‌ సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. ప్రసంగం చూసిన 509 మంది అమెరికన్ల అభిప్రాయాలను క్రోడీకరించి సీఎన్‌ఎన్‌/ఓఆర్‌సీ ఈ ఫలితాన్ని వెల్లడించింది. 57 శాతం మంది ట్రంప్‌ స్పీచ్‌ పట్ల పాజిటివ్‌గా స్పందించారు. అధ్యక్షుడు మంచి మార్గంలోనే వెళ్తున్నారనీ, సరైన ప్రాథమ్యాలు ఉన్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అభిప్రాయపడ్డారు. 2001లో నాటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ ప్రసంగం పట్ల 66 శాతం మంది, 2009లో అప్పటి అమెరికా అధినేత బరాక్‌ ఒబామా స్పీచ్‌పై 68 శాతం మంది పాజిటివ్‌గా స్పందించారు.

‘ట్రంప్‌ నిషేధం’ నుంచి ఇరాక్‌కు ఉపశమనం!

వాషింగ్టన్‌: ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా ట్రంప్‌ విధించిన నిషేధం నుంచి ఇరాక్‌కు ఉపశమనం కలగనుంది. శ్వేతసౌధంలో పనిచేసే ఓ అధికారి చెప్పిన దానిప్రకారం కొత్తగా తీసుకురానున్న ఉత్తర్వుల్లో ఇరాక్‌పై నిషేధం ఎత్తివేయనున్నారు.  ఐసిస్‌పై పోరులో సహకరిస్తున్నందుకుగానూ, ఇరాక్‌పై నిషేధం విషయంలో పునరాలోచించాలని పెంటాగాన్, ఇతర ప్రభుత్వ విభాగాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇంతకుముందు ట్రంప్‌ తీసుకొచ్చిన నిషేధ ఉత్తర్వులను పలు కోర్టులు కొట్టేయడంతో ఈసారి మరింత పగడ్బందీగా ఉత్తర్వులను అధికారులు తయారుచేశారు.

కాన్సస్‌ కాల్పులు దురదృష్టకరం
కాన్సస్‌ ఘటనపై ట్రంప్‌ ఎట్టకేలకు నోరువిప్పారు. ఈ ఘటనపై భారత–అమెరికన్‌ సమాజంతోపాటు అమెరికన్‌ చట్టసభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ఇటీవల యూదులపై దాడులు, గతవారం కాన్సస్‌ కాల్పుల ఘటన దురదృష్టకరం. ఇది విద్వేషపూరితమైన దుశ్చర్య. విధానాల విషయంలో భేదాలున్నప్పటికీ.. విద్వేషపూరిత చర్య ఏరూపంలో జరిగినా మనమంతా ఏకగ్రీవంగా ఖండించాలి’ అని ట్రంప్‌ ఉభయ సభల భేటీలో తెలిపారు. కాన్సస్‌ కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ‘వర్ణ వివక్షతో కూడిన విద్వేషపూరిత చర్య’ అని నిరూపించేలా ఆధారాలు దొరుకుతున్నాయని.. వర్ణ, మత పరమైన దాడులపై అధ్యక్షుడు ట్రంప్‌ విచారం వ్యక్తం చేస్తున్నారని సభా కార్యక్రమానికి ముందే.. వైట్‌హౌస్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో ట్రంప్‌.. కాన్సస్‌ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే, ట్రంప్‌ తొలి కాంగ్రెస్‌ ప్రసంగానికి కూచిభొట్ల శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను పిలవకపోవడాన్ని డెమోక్రటిక్‌ సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌ తప్పుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement