శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ ఘాటుగా స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని, శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పాటు దివంగత శ్రీనివాస్ భార్య సునయన ప్రెస్‌మీట్ పెట్టి ట్రంప్ ఏం సమాధానం చెబుతారని అడిగిన వార్తా కథనం క్లిప్పింగ్ కూడా జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది.
కాన్సాస్ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మరణించిన కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ఏడు ముస్లిం దేశాలకు చెందిన వాళ్లు అమెరికా రావడానికి వీలుండదు. ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులకు కోర్టులు అడ్డుకట్ట వేశాయి. దాంతో దాన్ని సవరించి మరో కొత్త చట్టాన్ని తెస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఎయిరిండియా విమానంలో సునయనతోపాటు శ్రీనివాస్ సోదరుడు ఈ మృతదేహాన్ని తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో పాటు ఉన్న అతడి స్నేహితుడు మాడసాని అలోక్ రెడ్డి మీద కూడా 51 ఏళ్ల ఆడమ్ పురిన్‌టన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అలోక్ రెడ్డితోపాటు, పురిన్‌టన్‌ను ఆపేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.