
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ సమస్య వైట్ హౌస్ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాగా, బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment