అందని ద్రాక్షగా అమెరికా అధ్యక్ష పీఠం
1872లో తొలిసారి ఓ మహిళ పోటీ
1968 బరిలో చార్లెన్ మిషెల్
తొలి నల్లజాతి మహిళగా రికార్డు
ప్రధాన పార్టీల నుంచి హిల్లరీయే
2016లో ట్రంప్ చేతిలోనే ఓటమి
అత్యధిక ఓట్లు సాధించినా నిరాశే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి.
ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది.
150 ఏళ్ల క్రితమే తొలి పోటీ
అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్‌హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్‌హల్‌కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్‌హల్‌కు 33 ఏళ్లు మాత్రమే.
ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్‌వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్‌మేట్‌గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్‌కెయిన్‌కు రన్నింగ్‌మేట్‌గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment