అశ్రు‘నయన’ ప్రశ్న | kuchibhotla Srinivas wife sunayana facebook post | Sakshi
Sakshi News home page

అశ్రు‘నయన’ ప్రశ్న

Published Thu, Mar 2 2017 3:15 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

kuchibhotla Srinivas wife sunayana facebook post



బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెలిగేవాడు. 2006 ఆగస్టులో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్‌’ ద్వారా పలకరించుకునే వాళ్లం. తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాబంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్‌ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. అందుకే నాలుగేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను.

ఎన్నో కలలతో కాన్సస్‌కు వచ్చాం..
విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం ఆయన తపించేవాడు. రాక్‌వెల్‌ కోలిన్స్‌ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫ్లయిట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లయిట్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్‌వెల్‌లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్‌ రాపిడ్స్‌లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు.

అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్‌లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్‌ స్వయంగా రంగులేశాడు.. గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు. ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి.. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది ఆలోచించని ఒకే ఒక వ్యక్తి మూలంగా..

పోలీసులు చెబుతుంటే నమ్మలేదు..
ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపో యా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా? మీరు శ్రీని వాస్‌ను చూశారా? తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా? మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురిం చేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నిం టికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమా ధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్‌లో ఉంటు న్న శ్రీనివాస్‌ తమ్ముడికి ఫోన్‌ చేశా.

నమ్మలేదు... నేనేదో జోక్‌ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మి త్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్‌ లూ యిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మి త్రులు వచ్చారు. న్యూయార్క్, నూజెర్సీలో ఉండే అతని బంధువులు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి త ను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్‌ ఎంగేజ్‌ మెంట్‌ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్‌ చేసుకున్నాం. ఈ ట్రిప్‌ కొరకు వీకెండ్‌లో షాపింగ్‌ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్‌కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని..

ఇమిగ్రేషన్‌పై ఆందోళన చెందేవాడు..
ఆయనకు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్‌ గురించి, నరేంద్ర మోదీ గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్‌. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను.

ఇమిగ్రేషన్‌ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్‌లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్‌–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్‌4 ఈఏడీ రూల్‌ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు. ‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లలో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట.




వెళ్లిపోదామా అని అడిగేదాన్ని..
ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఆత్మీయ ఆలింగనం లేదు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే..!

ఈ కష్టం ఎవరికీ రావొద్దు...
గార్మిన్‌ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్‌ నగర మేయర్‌కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్‌టచ్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఫ్రాంక్‌కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నేరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్‌ గ్రిలాట్‌ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్‌ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు.

మార్క్‌ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్‌ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్‌ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబ్‌బచ్చన్‌ సర్, షారూక్‌ ఖాన్‌ సర్‌... మేము మీకు వీరాభిమానులం.

ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేం కలలుగన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలసి నివసించడానికి ఇది సురక్షితమేనా?
– సునయన దుమాలా


నువ్వు ఎప్పటికీ నా వాడివే..
కాన్సస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎంతోమంది నన్ను గుర్తు పట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పర మార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి.. చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను. ఐ లవ్‌ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే. టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటు న్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు.

నాకో బిడ్డ ఉంటే తనలో శ్రీనును చూసుకునేదాన్ని..
ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అందత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమార్లు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపో యాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్నచిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం.

ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్‌కు మాకిద్దరికీ బాక్స్‌లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్‌ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్‌ బాక్స్‌ నేనే సర్దుకుంటే... ఏం తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్‌ చేశావనుకో... ఈరోజు లంచ్‌లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్‌ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్‌లో ఆర్నబ్‌ గోస్వామి షో ఎంజాయ్‌ చేసేవాడు.

మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా? అని ఎదురుచూస్తుండే వాడు. పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్‌ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలిచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా..’ అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్‌ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని.
- ఫేస్‌బుక్‌లో తన ఆవేదనకు అక్షరరూపమిచ్చిన సునయన

(అమెరికాలోని కాన్సస్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్‌ అర్ధాంగి సునయన 28–02–2017న తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement