ప్రవాసుల భద్రతకు పెద్దపీట
⇒ ఆపద వస్తే తక్షణం స్పందిస్తాం
⇒ విదేశాంగమంత్రి సుష్మ ప్రకటన
న్యూఢిల్లీ:
అమెరికాలో జాతి విద్వేషపు దాడులకు భారతీయులు బలైన నేపథ్యంలో దీనిపై బుధవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ప్రవాసుల సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. ఈ విషయంలో అమెరికా భద్రతా సంస్థల అధికారులు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ప్రవాసులు ఆపదలో ఉన్నట్టు తెలిస్తే 24 గంటల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సుష్మ పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో దాడికి గురైన కూచిభొట్ల శ్రీనివాస్, దీప్‌రాయ్ గురించి ఆమె ప్రకటన చేశారు. వారిద్దరి కుటుంబాలతో మాట్లాడినట్లు ఆమె చెప్పారు. అనారోగ్యానికి చికిత్స పొందాక తొలిసారి సభకు వచ్చిన సుష్మకు సభ్యులు ఘన స్వాగతం పలికారు.
రూ.12.52 లక్షల కోట్లు జమయ్యాయి..
పెద్దనోట్ల రద్దు తరువాత డిసెంబరు 10 వరకు బ్యాంకుల్లో రూ.12.52 లక్షల విలువైన పాత నోట్లు జమయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభకు తెలిపారు. నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది కాబట్టి పూర్తి వివరాలు ఇంకా అందుబాటులో లేవన్నారు. కొత్త రూ.500 నోటు ప్రింటింగ్‌కు రూ.2.87 నుంచి రూ.3.09 వరకు, కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర ఖర్చవుతోందని చెప్పారు. అయితే ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నందున మొత్తం ఖర్చు వివరాలు ప్రస్తుతం వెల్లడించడం సాధ్యం కాదన్నారు. 2017 ఫిబ్రవరి 24 నాటికి దేశంలో రూ.11.64 లక్షల కోట్ల కరెన్సీ చెలామణీలో ఉందని
మేఘవాల్ వివరించారు. ఏటీఎంలలో కరెన్సీ లభ్యతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పలుసార్లు రాజ్యసభ వాయిదా
మణిపూర్, గోవాలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి బీజేపీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ సభ్యులు నిరసనలకు దిగడంతో రాజ్యసభ మూడుసార్లు వాయిదాపడింది. సమావేశాలు మొదలవడంతో కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినదించారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదావేశారు. తిరిగి సమావేశం అయిన తరువాత కూడా ఆందోళనలు ఆగలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజాభీష్టాన్ని బీజేపీ లెక్క చేయలేదని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. ఈ రెండు చోట్లా తమకే మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే హక్కు తమకే ఉందని స్పష్టం చేశారు.
ముత్తుకృష్ణన్ కేసులో న్యాయం చేస్తాం : ప్రభుత్వం
ఢిల్లీ జేఎన్‌యూ పరిశోధన విద్యార్థి ముత్తుకృష్ణన్ ఆత్మహత్యపై లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ దాఖలయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణన్ మృతిపైS పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ సంతాపం ప్రకటించారు. ఈ ఘటన అందరికీ బాధ కలిగించిందని, ఆయన మృతికి కారణం తెలిశాక, ఢిల్లీ పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభలో అన్నాడీఎంకే సభ్యులు ముత్తుకృష్ణన్ ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తారు.
సభలో ‘జై శ్రీరాం’ నినాదాలు
యూపీలో బీజేపీ భారీ విజయం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభలో ఆయన సొంత పార్టీ సభ్యుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆయన సభలోకి అడుగు పెడుతుండగా.. బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరాం’, ‘మోదీ.. మోదీ’ అంటూ నినదించారు. సాధారణంగా ప్రముఖ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం వంటివి కనిపిస్తాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. మోదీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల మరణించిన లోక్‌సభ మాజీ సభ్యుడు, టీడీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి మృతికి ఎంపీలు సంతాపం తెలిపారు.