హైదరాబాద్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు, నేతలు భరోసా ఇచ్చారు. ఆదివారం అమీర్‌పేట జాగృతి ఎన్‌క్లేవ్‌లోని శరత్ నివాసానికి వెళ్లిన మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ బాల్క సుమన్, బండారు దత్తాత్రేయ.. శోకసంద్రంలో ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు రామ్మోహన్, మాలతిలను ఓదార్చారు. శరత్ మృతికి సంతాపం ప్రకటించి అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
శరత్ మరణం బాధాకరం: కేటీఆర్
దుండగుడి కాల్పుల్లో శరత్ దుర్మరణం చెందడం బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధను వ్యక్తం చేశారని.. కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఘటనపై అమెరికా దౌత్య కార్యాలయ రీజినల్ పాస్‌పోర్టు అధికారితోపాటు షికాగో కాన్సులేట్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడామన్నారు. భారత దౌత్య అధికారుల వివరాల ప్రకారం.. హత్యకు పాల్పడిన నిందితుడు ఎవరన్నది తెలియరాలేదన్నారు.
హత్యకు గల కారణాలు తెలియడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పారు. అమెరికాలో శని, ఆదివారాలు సెలవు అయినందున భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు 4, 5 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. ‘కుటుంబ సభ్యులు, బంధువులు అమెరికా వెళ్లాలనుకుంటే ప్రభుత్వపరంగా అత్యవసర వీసాలు, ప్రయాణ ఖర్చులు, ఏర్పాట్లు చేస్తామని చెప్పాం. వారు ఆలోచించుకుని చెబుతామన్నారు’అని కేటీఆర్ తెలిపారు. కాన్సస్‌లో చాలామంది తెలుగువారున్నారని.. అక్కడి వారితో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారని చెప్పారు. మరోవైపు శరత్ కొప్పు మృతిపై అమెరికా కాన్సులెట్ జనరల్ కథెరిన్ బి హడ్డా తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో శరత్ తల్లిదండ్రులు: కడియం
దుండగుడిని పట్టుకోడానికి అమెరికా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి కడియం చెప్పారు. దుండగుడిని గుర్తించిన వారికి నగదు పారితోషికం కూడా ప్రకటించారన్నారు. తీవ్ర దుఃఖంలో ఏం మాట్లాడలేని పరిస్థితిలో శరత్ తల్లిదండ్రులు ఉన్నారని, తల్లి మాలతి మంచినీరు కూడా తీసుకోవడం లేదన్నారు. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని వైద్యులను సీఎం ఆదేశించారని చెప్పారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి త్వరగా మృతదేహన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ తెలిపారు. శరత్ మృతదేహాన్ని రీజినల్ హబ్ సర్చ్ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బిల్లు చెల్లింపులో గొడవ!
ఎంఎస్ చేస్తూనే అక్కడి ఓ రెస్టారెంట్‌లో శరత్ పని చేస్తున్నట్లు తెలిసింది. దుండగుడు కాల్పులు జరిపింది కూడా ఆ రెస్టారెంట్‌లోనేనని శరత్ సోదరికి అతని స్నేహితులు ఫోన్‌లో చెప్పినట్లు సమాచారం. బిల్లు చెల్లించే విషయంలో దుండగుడికి శరత్‌కు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని, పారిపోయేందుకు శరత్ ప్రయత్నించినా అప్పటికే 5 బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు తెలిసింది. గొడవకు గల కారణాలు తెలుసుకోడానికి విచారణ చేస్తున్నామని భారత దౌత్య కార్యాలయ అధికారులకు అక్కడి పోలీసులు తెలిపినట్లు సమాచారం.
అన్ని విధాలా సాయం చేస్తాం: సుష్మ
శరత్ మృతిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన వివరాలను పోలీసుల ద్వారా> తెలుసుకుంటున్నామని, విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తామని ట్వీట్ చేశారు. శరత్ తండ్రితో మట్లాడానని, కుటుంబ సభ్యులు కాన్సస్ వెళ్లాలనుకుంటే వీసా ఏర్పాటు చేస్తామన్నామని పేర్కొన్నారు. భౌతిక కాయాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment