శరత్ కొప్పు... (ఇన్‌సెట్‌లో పోలీసులు విడుదల చేసిన నిందితుడి చిత్రం)
గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి కొప్పు శరత్(26) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీ దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లకు విడుదల చేసిన కాన్సస్ నగరం పోలీసులు.. నిందితుడిని పట్టించిన వారికి నజరానా ఇస్తామని ప్రకటించారు. అయితే పరిగెత్తటంతోనే శరత్ ప్రాణాలు గాల్లో కలిసిపోయానని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
మిస్సోరి: కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో వరంగల్‌కు చెందిన శరత్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్‌లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితోపాటు ముగ్గురు కస్టమర్లు టేబుళ్ల కింద నక్కారు. కానీ, శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. బయటకు వచ్చిన సిబ్బంది ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి సమాచారం అందించారు. శరత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించిన అధికారులు.. నిందితుడి చిత్రాలను విడుదల చేసి పట్టించిన వారికి 10,000 డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్/వరంగల్: శరత్ మృతితో అతని స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైద్రాబాద్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన శరత్.. ఆ తర్వాత ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అయితే శరత్ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడని మాత్రమే తమకు తెలుసని, రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలీదని తండ్రి రామ్మోహన్ చెబుతున్నారు. త్వరలో శరత్ సోదరి వివాహం ఉంది. ఆ వేడుకకు వచ్చేందుకు శరత్ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది.
పరామర్శించిన కేటీఆర్.. కాగా, శరత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘దౌత్య సిబ్బందితో మాట్లాడాం. కుటుంబ సభ్యులు వెళ్లాలనుకుంటే అమెరికాకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. వీలైనంత త్వరగా మృత దేహం ఇక్కడికి వచ్చేలా చూస్తాం’ అని కేటీఆర్ అన్నారు. ‘ప్రస్తుతం శరత్ మృత దేహాం ఇంకా ఆస్పత్రిలోనే ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఎంబసీకి పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ లభించాక ఇండియాకు తరలిస్తారు. ఈ ప్రక్రియకు రెండు రోజులు పట్టొచ్చు అని అధికారులు పేర్కొన్నట్లు’ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment