
కాన్సస్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని కాన్సస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి శరత్ కొప్పు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కుటుంబానికి శరత్ భౌతిక కాయం చేరలేదు. శరత్ భౌతిక కాయాన్ని హైదరాబాద్ తరలించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో శరత్ బీటెక్ చేశారు.
ఆరునెలల కిందట ఎంఎస్ చదివేందుకు శరత్ అమెరికా వెళ్లారు. కాన్సస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో శరత్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్‌లోకి వచ్చి గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితోపాటు ముగ్గురు కస్టమర్లు టేబుళ్ల కింద నక్కారు. కానీ, శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. బయటకు వచ్చిన సిబ్బంది ఎమర్జెన్సీ నంబర్ 911కు కాల్ చేసి సమాచారం అందించారు. శరత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.