'చర్చకు ఒప్పుకోం, రాజీనామా చేయాల్సిందే'
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్' వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని సీపీఎం స్పష్టం చేసింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో చర్చిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ అనేది నిష్పక్షపాత దర్యాప్తుకు ప్రత్యామ్నాయం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుష్మ, రాజె రాజీనామా చేసి తీరాల్సిందేనని స్పష్టీకరించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటే విపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించాల్సిదేనని అన్నారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై బీజేపీ ఇంతే పట్టుదలతో వ్యవహరించిందని ఏచూరి గుర్తు చేశారు.