‘లలిత్‌గేట్’ మూసేదెలా? | |Lalit Gate: People in Jaipur protest against Vasundhara Raje | Sakshi
Sakshi News home page

‘లలిత్‌గేట్’ మూసేదెలా?

Published Sun, Jun 28 2015 2:59 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

‘లలిత్‌గేట్’ మూసేదెలా? - Sakshi

‘లలిత్‌గేట్’ మూసేదెలా?

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పాలనలో వేగం పెంచడానికి, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, భూ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఈ సమావేశాలు సజావుగా సాగడం మోదీ ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలంటే కాంగ్రెస్ సహా విపక్షాల సహకారం చాలా అవసరం. అదీ, రాజ్యసభలో ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందున విపక్షాల మద్దతు లేకుండా ముందుకెళ్లడం ఎన్డీయే సర్కారుకు కత్తి మీద సామే.

ఈ పరిస్థితుల్లో తాజాగా తెరపైకి వచ్చిన ‘లలిత్ గేట్’ కేంద్రానికి కొత్త తలనొప్పి తీసుకువచ్చింది. 20-20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే వేర్వేరు సందర్భాల్లో సహకరించారన్న ఆరోపణలు టీ కప్పులో తుఫానులా ప్రారంభమై.. సునామీలా మోదీ సర్కారును కుదిపేస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్‌కు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయి.

సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలు రాజీనామా చేయడమో లేక వారిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంటు సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల సజావు నిర్వహణ కోసం కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గడమో.. లేక ప్రతిపక్షాలతో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంతో తమ సీనియర్ నేతలకు బాసటగా నిలవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నెలకొంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న తాజా సంక్షోభంపై ‘సాక్షి’ ఫోకస్..     
- నేషనల్ డెస్క్

 
* మోదీ సర్కారు మల్లగుల్లాలు   
* పార్లమెంటు సమావేశాల ముందు ప్రభుత్వానికి తలనొప్పి


తెరపైకి రాజే!
లలిత్‌గేట్‌లో తొలుత కేంద్రమంత్రి సుష్మ తర్వాత  వసుంధర రాజే ప్రవేశించారు. 2011లో లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ పొందేందుకు బ్రిటన్ అధికారుల ముందు అందించాల్సిన లిఖితపూర్వక సాక్ష్యం రాజేనే ఇచ్చారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా లలిత్‌మోదీనే ట్వీట్ చేశారు. ఆ తరువాత సంబంధిత డాక్యుమెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. మొదట్లో, అదేంలేదంటూ  బుకాయించిన వసుంధర.. ఆ తరువాత ఆ డాక్యుమెంట్, దానిపై తన సంతకం బయటపడటంతో పార్టీ అగ్ర నాయకత్వానికి వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి.  

కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో తన భార్యతో పాటు పోర్చుగల్ వచ్చింది వసుంధర రాజేనే అని, తన ఇమ్మిగ్రేషన్‌కు మద్దతుగా సాక్ష్యమిచ్చేందుకు బ్రిటన్ కోర్టు ముందుకు రావడానికి కూడా వసుంధర సంతోషంగా ఒప్పుకున్నారని, అయితే, అప్పటికే ఆమె సీఎం కావడంతో అది కుదరలేదని అని సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ కుండబద్ధలు కొట్టారు. తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయని వివరించారు. దీంతో వసుంధర రాజే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.
 
ఇది మోదీ వ్యూహమే!
ఈ వివాదంలోకి వసుంధర రాజేను లాగడం లలిత్‌మోదీ వ్యూహమే. దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కొన్ని కారణలతో దెబ్బతినడం, తనను కావాలనే రాజే పక్కన పెడ్తున్నారని లలిత్ మోదీ భావించడం.. ఈ వివాదంలోకి రాజేను లాగడానికి కారణమైంది. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) ఎన్నికల్లో.. గత 40 ఏళ్లుగా రాష్ట్ర క్రికెట్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను, అప్పటివరకు అంతగా ఎవరికీ తెలియని లలిత్‌మోదీ ఓడించారు.

నిజానికి రుంగ్తాను ఓడించింది లలిత్ మోదీ కాదు.. ఆయన వెనకున్న నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఆ తరువాత వసుంధర రాజే మద్ధతుతో రాజస్తాన్‌లో మోదీ శకం ప్రారంభమైంది. ఒక దశలో మోదీని అంతా ‘సూపర్ సీఎం’ అనుకునేవారు. దాదాపు 2 వేల గజాలున్న, పురాతత్వ ప్రాముఖ్యత ఉన్న రెండు హవేలీలను కారుచవకగా కేవలం రూ. 30 లక్షలకు మోదీకి చెందిన కంపెనీకి అమ్మేయడం రాజేపై అవినీతి ఆరోపణల్లో అతి పెద్దది. మోదీ, రాజేల అవినీతితో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది.

ఆ తరువాత ఐపీఎల్‌లో అవకతవకలు బయటపడిన తరువాత బీసీసీఐ లలిత్‌మోదీపై జీవిత కాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోకుండా, రాజే 2014(అప్పటికి ఆమె మళ్లీ సీఎం అయ్యారు) మేలో ఆర్‌సీఏ అధ్యక్షుడిగా మోదీ ఎన్నికయ్యేలా చూశారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఆర్‌సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ ఆర్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి మోదీని తొలగించి తాను అధ్యక్షుడయ్యారు.

దీని వెనుక వసుంధర రాజేనే ఉన్నారని లలిత్ భావించారు. అమిన్ పఠాన్ అధ్యక్షుడవడాన్ని లలిత్ మోదీ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో జనరల్ బాడీ సమావేశం పెట్టి మరీ లలిత్‌ను ఆర్‌సీఏ నుంచి సాగనంపారు. ఇదంతా రాజే కుట్రనే అని లలిత్ భావించడంతో వారిద్దరి మధ్య విబేధాలు తీవ్రమయ్యయి. దాంతో సమయం చూసుకుని లలిత్ వదిలిన ట్వీట్లలో రాజే చిక్కుకున్నారు.
 
పెట్టుబడులు కూడా!
వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన నియంత్ హెరిటేజ్ హోటల్స్ కంపెనీలో లలిత్ మోదీ దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని, ఆ పెట్టుబడులు షేర్ల రూపంలో పరోక్షంగా రాజే ఖాతాలోకే వెళ్లాయని వార్తలు వెలువడటంతో వసుంధర మరింత చిక్కుల్లో పడ్డారు. నియంత్ కంపెనీలో రూ.10 విలువైన షేరును అత్యధికంగా రూ. 96 వేల పైచిలుకు ప్రీమియంతో మోదీ కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది.
 
ఎలా మొదలైంది?
లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేలా సుష్మా స్వరాజ్ సహకరించారనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు వెల్లడి కావడంతో ‘లలిత్‌గేట్’ గేట్లు తెరుచుకున్నాయి. ఆ విషయం వాస్తవమేనని ఒప్పుకున్న సుష్మ.. మోదీ భార్య కేన్సర్‌తో బాధ పడుతోందని, ఆమె చికిత్స కోసం తాను పోర్చుగల్ వెళ్లాల్సి ఉందని మోదీ అభ్యర్థించడంతో మానవతా దృక్పథంతో మాట సాయం చేశానని చెప్పారు.

అయితే, తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న నిందితుడికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి సహకరించడం నేరమే అవుతుందని, అందువల్ల సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడ్తున్నాయి. మరోవైపు,  సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాన్సురి స్వరాజ్ తనకు చాలా సంవత్సరాలు ఉచితంగా న్యాయ సేవలందించారంటూ లలిత్ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యంలా మారింది.
 
సుష్మాకు మద్దతు.. రాజేకు మౌనం!
సుష్మా స్వరాజ్ అంశం వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచాయి. సుష్మా తప్పేం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో ఆమెకు ఆరెస్సెస్ కూడా మద్దతుగా నిలిచిందని సమాచారం. అదే వసుంధర రాజే విషయానికి వచ్చేసరికి.. మొదట్లో ప్రభుత్వం, పార్టీ మౌనం వహించాయి. బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దాంతో సుష్మాను కాపాడేందుకు రాజేను బలి చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి.

కొన్ని రోజుల తరువాతే, చర్చోపచర్చల అనంతరమే రాజేకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం మోదీ సర్కారు తీసుకుంది. వసుంధర రాజే రాజస్తాన్‌లో పార్టీకి ఉన్న ఏకైక, ప్రజాకర్షక నేత కావడం, ఆమెకు రాజస్తాన్ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించడం, ఎమ్మెల్యేల మద్దతుతో అవసరమైతే అగ్ర నాయకత్వాన్నైనా ఎదుర్కొనేందుకు రాజే సిద్ధమవుతున్నారని, సంతకాల సేకరణ కూడా ప్రారంభించారని వార్తలు రావడం, ఆరెస్సెస్ సపోర్ట్ కూడా ఆమెకే ఉండటం.. తదితర కారణాల వల్లనే బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని, ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందని జైపూర్ వర్గాల సమాచారం.
 
కిం కర్తవ్యం!?
ఊహించని ఉత్పాతంగా మారిన ‘లలిత్‌గేట్’తో మోదీ సర్కారు ఆత్మ రక్షణలో పడింది. ఇప్పుడే ఈ విషయంలో కాంగ్రెస్ విమర్శలకు సరిగ్గా సమాధానమివ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక సకల అస్త్రాలతో సన్నద్ధంగా ఉన్న ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ముందు రెండే మార్గాలున్నాయని.. ఒకటి, విపక్ష ఒత్తిడికి తలొగ్గి రాజేతో రాజీనామా చేయించడం.. రెండోది, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం, అందుకు అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకోవడమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement