Opposition Congress
-
కాంగ్రెస్‌తో లాభం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను పక్కనబెడతామన్నారు. జీవం కోల్పోయిన ఆ పార్టీ కోసం వేచి చూడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ వ్యవస్థాగతంగా గెలవగలిగే స్థితిలో ఉండేది. ఆ పార్టీ ఇప్పుడు ప్రతి చోటా ఓటమి చవిచూస్తోంది. గెలుపుపై ఆ పార్టీ నేతలకు ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. విశ్వసనీయత కోల్పోయిన ఆ పార్టీపై ఆధారపడటంలో అర్థం లేదు’అని తెలిపారు. బలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తే మరింత శక్తివంతంగా మారవచ్చునని చెప్పారు. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో మళ్లీ అధికారంలోకి రాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతుండగా, మమతా బెనర్జీ కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని కావాలనుకుంటున్నారనీ, ఇద్దరికీ తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఓట్లు లూటీ చేసి బీజేపీ గెలిచింది యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజా తీర్పుకి అద్దం పట్టడం లేదని మమతా బెనర్జీ అన్నారు. కాషాయ కూటమి ఎన్నికల యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. అందుకే సమాజ్‌వాదీ ఓడిందన్నారు. బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు. ‘‘ఏదో కొన్ని రాష్ట్రాల్లో నెగ్గామని బీజేపీ గొంతు పెంచొద్దు. ఈ విజయం ప్రజాతీర్పుకు నిదర్శనం కాదు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు. బీజేపీ పగటి కలలు ఆపాలి’’ అన్నారు. -
దుష్టపన్నాగాలను తిప్పికొట్టండి: కేసీఆర్
- విపక్ష కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి ఫైర్ - అభివృద్ధికి ఆటంకాలా? రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తారా? - విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులపై హైకోర్టు తీర్పు హర్షణీయం హైదరాబాద్: అధికారంలోకి వస్తామనుకుని భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి మంచిపనికీ అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రాజెక్టులు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఇలా అన్నిటికి అన్ని విషయాల్లోనూ కోర్టులకు వెళ్లి కాంగ్రెస్ కేసులు వేస్తోందని, విపక్షపార్టీ తీరుతో అన్నిపనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ దుష్టపన్నాగాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులపైనే 164 కేసులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనైతే 20 రోజుల వ్యవధిలో ఆరు కేసులు వేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు, డిపెండెంట్ ఉద్యోగాలిస్తామంటే కేసులు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటే కేసులు.. అసలు దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఆ పార్టీ వల్ల లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు, కార్మికుల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ శిఖండి పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎక్కడికక్కడ నిలదీయాలి’ అని కేసీఆర్ అన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు.. హైకోర్టుకు ధన్యవాదాలు ట్రాన్స్‌కో, జెన్‌కోలతోపాటు రెండు డిస్కంలలో కాంట్రాక్టర్ల కింద పనిచేస్తోన్నవారిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రక్రియపై స్టేను ఎత్తివేసిన హైకోర్టుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. నిజానికి వారిని క్రమబద్ధీకరించలేదని, కాంట్రాక్టర్ల చెర నుంచి విడిపించి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విధానాన్ని రూపొందించామని వివరించారు. ఈ విషయంలో కోర్టు మానవతాధృక్ఫథంతో ఆలోచించిందని, ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న సీఎం.. ప్రభుత్వ లాయర్లు అద్భుతంగా వాదించారని కితాబిచ్చారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై.. ఎన్నికల హామీ మేరకు సింగరేణిలో వారసత్వం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినా, కోర్టు ఉత్తర్వుల వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయితే, ప్రక్రియను తిరిగి పునరుద్ధరించేలా సింగరేణి వరకు ప్రత్యేక చట్టం తేవాలా? లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపాలా? అనేదానిపై అధికారులతో చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు. నిజానికి బొగ్గుబావుల్లో ఉద్యోగంచేసేవారు.. దేశాన్ని కాపాడే జవాన్లకంటే ఏమాత్రం తక్కువ కాదని, అందుకే వారసత్వ ఉద్యోగాల కల్పనలో వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని గతంలో(నాటి ప్రధాని మన్మోహన్‌కు) లేఖరాసినట్లు కేసీఆర్ చెప్పారు. గూర్ఖాలాండ్ ఉద్యమానికి మద్దతుపై.. పశ్చిమ బెంగాల్ నుంచి విడదీసి ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉధృతంగా సాగుతోన్న ఉద్యమంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమంపై విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదని, అలా తీసుకోలేక పోవడానికి కూడా కారణాలున్నాయని వివరించారు. ‘గూర్ఖాలాండ్ అంతర్జాతీయ సరిహద్దులో ఉంది. ఉన్నట్లుండి ఇప్పుడే ఉద్యమం ఉధృతం కావడం వెనుక చైనా హస్తం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. గూర్ఖాలాండ్ ఏర్పడితే ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం చెలరేగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ మా స్టాండ్ చెప్పాల్సి వస్తే పార్టీలో చర్చించి చెబుతాం’ అని కేసీఆర్ అన్నారు. సీట్లు పెంచినా లేకున్నా ఒకటే ‘కొత్త రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని చట్టంలో ఉంది. కానీ డ్రాఫ్టులో పొరపాట్ల వల్ల ఆ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మొన్న ప్రధాని మోదీని కలిసినప్పుడు దీనిపై మాట్లాడాను. మావరకైతే సీట్లు పెంచినా, లేకున్నా ఒకటే. కానీ కేంద్రం వైపు నంచి సందిగ్ధత తొలగించాలని ప్రధానిని కోరా’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీట్లు పెరగకపోయినప్పటికీ టీఆర్ఎస్కు ఇబ్బందులు ఉండవని, రాజకీయంగా స్థిరంగా కొనసాగుతున్నామని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌కు ములాయం షాక్
సభలను సాగనివ్వండి లేకపోతే బహిష్కరించండన్న ములాయం న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిష్టంభన విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటివరకూ ఆ పార్టీతో కలిసి సభా కార్యకలాపాలను అడ్డుకున్న సమాజ్‌వాది పార్టీ అకస్మాత్తుగా ఎదురు తిరిగింది. కాంగ్రెస్ వైఖరితో విభేదిస్తూ.. సమావేశాలను సాగనివ్వాలని, లేదంటే వాటిని బహిష్కరించాలని కాంగ్రెస్‌కు హితబోధ చేసింది. ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సోమవారం పార్టీలతో నిర్వహించిన భేటీలో కాంగ్రెస్‌కు ఈ పరిణామం ఎదురైంది. ప్రతిష్టంభన తొలగిపోవాలంటే తమ డిమాండ్లు ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, ఆ ఆరోపణలపై సంబంధిత మంత్రి, ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు అనుమతించాలని ఎస్పీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్ పేర్కొన్నారు. గత వారంలో కాంగ్రెస్ సభ్యులు 25 మందిని స్పీకర్ సస్పెండ్ చేసినపుడు ఆ పార్టీకి ఎస్పీ సంఘీభావం తెలపటమే కాకుండా.. లోక్‌సభ సమావేశాలను కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ డిమాండ్లు ఏమిటో తనకు తెలియదని.. ఆ పార్టీ డిమాండ్ ఏమిటో వెల్లడించనపుడు తమ పార్టీ వైఖరి ఏమిటనేది చెప్తామని ములాయం పేర్కొన్నట్లు సమాచారం. సభలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుందని.. సభ జరగకుండా కాంగ్రెస్ ఎలా గందరగోళం సృష్టిస్తుందని ఆయన అఖిలపక్ష సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిసింది. కాంగ్రెస్ సభలో మాట్లాడాలని, అప్పుడు ఇతర పార్టీలు తమ మద్దతు గురించి నిర్ణయించుకుంటాయని.. కాంగ్రెస్ అలా మాట్లాడని పక్షంలో సభను బహిష్కరించి నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని ములాయం పేర్కొన్నారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో తలెత్తిన అంశాలపై 193 నిబంధన కింద చర్చకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా సభ సాగాలని.. అయితే 193 నిబంధన కింద కాకుండా, కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత చర్చ జరపాలని ఆ పార్టీ పేర్కొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత మల్లికార్జునఖర్గే, ఆర్జేడీ, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ నేతలు హాజరయ్యారు. -
మీ వల్లే.. కాదు మీ వల్లే!
పార్లమెంట్ ప్రతిష్టంభనపై అధికార, విపక్షాల పరస్పర నిందలు న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యక్రమాల ప్రతిష్టంభనపై అధికార, విపక్షాలు పరస్పర నిందారోపణలు ప్రారంభించాయి. ప్రతిష్టంభనలో ప్రభుత్వం తప్పు లేదని, విపక్ష కాంగ్రెస్, వామపక్షాలే దానికి కారణమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించగా.. ప్రధాని మోదీ అహంకారం, మొండి పట్టుదల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఎదురుదాడి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, సభను సజావుగా నడిపేందుకు సోమవారం మరోసారి అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతిష్టంభనపై అన్ని విపక్ష పార్టీలతో చర్చించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని, శుక్రవారం కూడా అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ ముందుకురాలేదని వెంకయ్య చెప్పారు. 14 నెలల బీజేపీ పాలనలో అవినీతి ఆరోపణలేవీ రాలేదని శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘రెండు వారాలు సభను అడ్డుకోవడంతో కాంగ్రెస్ సంతోషంగా ఉంది. కానీ వారు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుర్తించలేకపోతున్నార’ని అన్నారు. సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి జీతభత్యాల్లో కోత విధించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. అలాంటి డిమాండ్లు మరిన్ని రావాలన్నారు. ప్రభుత్వం జరపనున్న అఖిలపక్ష భేటీపై కాంగ్రెస్ స్పందించింది. మోదీగేట్‌లో పాత్ర ఉన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్లు రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై ప్రధాని నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే.. అఖిల పక్ష భేటీకి వెళ్తామని చెప్పంది. ‘ఫొటోలు, టీ, శాండ్విచ్ల మొక్కుబడి భేటీపై మాకు ఆసక్తి లేదు’ అని ఆనంద్ శర్మ అన్నారు. -
‘లలిత్‌గేట్’ మూసేదెలా?
జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పాలనలో వేగం పెంచడానికి, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, భూ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఈ సమావేశాలు సజావుగా సాగడం మోదీ ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలంటే కాంగ్రెస్ సహా విపక్షాల సహకారం చాలా అవసరం. అదీ, రాజ్యసభలో ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందున విపక్షాల మద్దతు లేకుండా ముందుకెళ్లడం ఎన్డీయే సర్కారుకు కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో తాజాగా తెరపైకి వచ్చిన ‘లలిత్ గేట్’ కేంద్రానికి కొత్త తలనొప్పి తీసుకువచ్చింది. 20-20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే వేర్వేరు సందర్భాల్లో సహకరించారన్న ఆరోపణలు టీ కప్పులో తుఫానులా ప్రారంభమై.. సునామీలా మోదీ సర్కారును కుదిపేస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్‌కు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయి. సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలు రాజీనామా చేయడమో లేక వారిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంటు సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల సజావు నిర్వహణ కోసం కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గడమో.. లేక ప్రతిపక్షాలతో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంతో తమ సీనియర్ నేతలకు బాసటగా నిలవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నెలకొంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న తాజా సంక్షోభంపై ‘సాక్షి’ ఫోకస్.. - నేషనల్ డెస్క్ * మోదీ సర్కారు మల్లగుల్లాలు * పార్లమెంటు సమావేశాల ముందు ప్రభుత్వానికి తలనొప్పి తెరపైకి రాజే! లలిత్‌గేట్‌లో తొలుత కేంద్రమంత్రి సుష్మ తర్వాత వసుంధర రాజే ప్రవేశించారు. 2011లో లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ పొందేందుకు బ్రిటన్ అధికారుల ముందు అందించాల్సిన లిఖితపూర్వక సాక్ష్యం రాజేనే ఇచ్చారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా లలిత్మోదీనే ట్వీట్ చేశారు. ఆ తరువాత సంబంధిత డాక్యుమెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. మొదట్లో, అదేంలేదంటూ బుకాయించిన వసుంధర.. ఆ తరువాత ఆ డాక్యుమెంట్, దానిపై తన సంతకం బయటపడటంతో పార్టీ అగ్ర నాయకత్వానికి వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో తన భార్యతో పాటు పోర్చుగల్ వచ్చింది వసుంధర రాజేనే అని, తన ఇమ్మిగ్రేషన్‌కు మద్దతుగా సాక్ష్యమిచ్చేందుకు బ్రిటన్ కోర్టు ముందుకు రావడానికి కూడా వసుంధర సంతోషంగా ఒప్పుకున్నారని, అయితే, అప్పటికే ఆమె సీఎం కావడంతో అది కుదరలేదని అని సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ కుండబద్ధలు కొట్టారు. తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయని వివరించారు. దీంతో వసుంధర రాజే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇది మోదీ వ్యూహమే! ఈ వివాదంలోకి వసుంధర రాజేను లాగడం లలిత్‌మోదీ వ్యూహమే. దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కొన్ని కారణలతో దెబ్బతినడం, తనను కావాలనే రాజే పక్కన పెడ్తున్నారని లలిత్ మోదీ భావించడం.. ఈ వివాదంలోకి రాజేను లాగడానికి కారణమైంది. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) ఎన్నికల్లో.. గత 40 ఏళ్లుగా రాష్ట్ర క్రికెట్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను, అప్పటివరకు అంతగా ఎవరికీ తెలియని లలిత్‌మోదీ ఓడించారు. నిజానికి రుంగ్తాను ఓడించింది లలిత్ మోదీ కాదు.. ఆయన వెనకున్న నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఆ తరువాత వసుంధర రాజే మద్ధతుతో రాజస్తాన్‌లో మోదీ శకం ప్రారంభమైంది. ఒక దశలో మోదీని అంతా ‘సూపర్ సీఎం’ అనుకునేవారు. దాదాపు 2 వేల గజాలున్న, పురాతత్వ ప్రాముఖ్యత ఉన్న రెండు హవేలీలను కారుచవకగా కేవలం రూ. 30 లక్షలకు మోదీకి చెందిన కంపెనీకి అమ్మేయడం రాజేపై అవినీతి ఆరోపణల్లో అతి పెద్దది. మోదీ, రాజేల అవినీతితో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత ఐపీఎల్లో అవకతవకలు బయటపడిన తరువాత బీసీసీఐ లలిత్‌మోదీపై జీవిత కాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోకుండా, రాజే 2014(అప్పటికి ఆమె మళ్లీ సీఎం అయ్యారు) మేలో ఆర్సీఏ అధ్యక్షుడిగా మోదీ ఎన్నికయ్యేలా చూశారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్ష పదవి నుంచి మోదీని తొలగించి తాను అధ్యక్షుడయ్యారు. దీని వెనుక వసుంధర రాజేనే ఉన్నారని లలిత్ భావించారు. అమిన్ పఠాన్ అధ్యక్షుడవడాన్ని లలిత్ మోదీ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో జనరల్ బాడీ సమావేశం పెట్టి మరీ లలిత్‌ను ఆర్సీఏ నుంచి సాగనంపారు. ఇదంతా రాజే కుట్రనే అని లలిత్ భావించడంతో వారిద్దరి మధ్య విబేధాలు తీవ్రమయ్యయి. దాంతో సమయం చూసుకుని లలిత్ వదిలిన ట్వీట్లలో రాజే చిక్కుకున్నారు. పెట్టుబడులు కూడా! వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన నియంత్ హెరిటేజ్ హోటల్స్ కంపెనీలో లలిత్ మోదీ దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని, ఆ పెట్టుబడులు షేర్ల రూపంలో పరోక్షంగా రాజే ఖాతాలోకే వెళ్లాయని వార్తలు వెలువడటంతో వసుంధర మరింత చిక్కుల్లో పడ్డారు. నియంత్ కంపెనీలో రూ.10 విలువైన షేరును అత్యధికంగా రూ. 96 వేల పైచిలుకు ప్రీమియంతో మోదీ కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఎలా మొదలైంది? లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేలా సుష్మా స్వరాజ్ సహకరించారనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు వెల్లడి కావడంతో ‘లలిత్‌గేట్’ గేట్లు తెరుచుకున్నాయి. ఆ విషయం వాస్తవమేనని ఒప్పుకున్న సుష్మ.. మోదీ భార్య కేన్సర్‌తో బాధ పడుతోందని, ఆమె చికిత్స కోసం తాను పోర్చుగల్ వెళ్లాల్సి ఉందని మోదీ అభ్యర్థించడంతో మానవతా దృక్పథంతో మాట సాయం చేశానని చెప్పారు. అయితే, తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న నిందితుడికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి సహకరించడం నేరమే అవుతుందని, అందువల్ల సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడ్తున్నాయి. మరోవైపు, సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాన్సురి స్వరాజ్ తనకు చాలా సంవత్సరాలు ఉచితంగా న్యాయ సేవలందించారంటూ లలిత్ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యంలా మారింది. సుష్మాకు మద్దతు.. రాజేకు మౌనం! సుష్మా స్వరాజ్ అంశం వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచాయి. సుష్మా తప్పేం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో ఆమెకు ఆరెస్సెస్ కూడా మద్దతుగా నిలిచిందని సమాచారం. అదే వసుంధర రాజే విషయానికి వచ్చేసరికి.. మొదట్లో ప్రభుత్వం, పార్టీ మౌనం వహించాయి. బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దాంతో సుష్మాను కాపాడేందుకు రాజేను బలి చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తరువాతే, చర్చోపచర్చల అనంతరమే రాజేకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం మోదీ సర్కారు తీసుకుంది. వసుంధర రాజే రాజస్తాన్‌లో పార్టీకి ఉన్న ఏకైక, ప్రజాకర్షక నేత కావడం, ఆమెకు రాజస్తాన్ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించడం, ఎమ్మెల్యేల మద్దతుతో అవసరమైతే అగ్ర నాయకత్వాన్నైనా ఎదుర్కొనేందుకు రాజే సిద్ధమవుతున్నారని, సంతకాల సేకరణ కూడా ప్రారంభించారని వార్తలు రావడం, ఆరెస్సెస్ సపోర్ట్ కూడా ఆమెకే ఉండటం.. తదితర కారణాల వల్లనే బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని, ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందని జైపూర్ వర్గాల సమాచారం. కిం కర్తవ్యం!? ఊహించని ఉత్పాతంగా మారిన ‘లలిత్‌గేట్’తో మోదీ సర్కారు ఆత్మ రక్షణలో పడింది. ఇప్పుడే ఈ విషయంలో కాంగ్రెస్ విమర్శలకు సరిగ్గా సమాధానమివ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక సకల అస్త్రాలతో సన్నద్ధంగా ఉన్న ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ముందు రెండే మార్గాలున్నాయని.. ఒకటి, విపక్ష ఒత్తిడికి తలొగ్గి రాజేతో రాజీనామా చేయించడం.. రెండోది, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం, అందుకు అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకోవడమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
గుజరాత్లో తప్పనిసరి ‘ఓటు’
రాజ్‌కోట్/అహ్మదాబాద్: గుజరాత్లో వచ్చే అక్టోబర్ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ‘తప్పనిసరి ఓటు’ నిబంధనలు ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను బీజేపీ సర్కారు తోసిపుచ్చింది. ‘‘ఓటు వేయటం తప్పనిసరి చేస్తూ బిల్లుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చట్టాన్ని కార్పొరేషన్, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తాం. ఓటు వేయని వారి కోసం మేం నిబంధనలు రూపొందిస్తున్నాం. వాటిని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పాటిల్ గురువారం రాజ్‌కోట్‌లో విలేకరులకు తెలిపారు. ఇలాంటి చట్టం నియంతృత్వ పాలనకు ప్రతీక అని ప్రతిపక్షనేత శంకర్‌సింగ్‌వాఘేలా విమర్శించారు.