కాంగ్రెస్‌కు ములాయం షాక్
సభలను సాగనివ్వండి లేకపోతే బహిష్కరించండన్న ములాయం
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిష్టంభన విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటివరకూ ఆ పార్టీతో కలిసి సభా కార్యకలాపాలను అడ్డుకున్న సమాజ్‌వాది పార్టీ అకస్మాత్తుగా ఎదురు తిరిగింది. కాంగ్రెస్ వైఖరితో విభేదిస్తూ.. సమావేశాలను సాగనివ్వాలని, లేదంటే వాటిని బహిష్కరించాలని కాంగ్రెస్‌కు హితబోధ చేసింది. ప్రతిష్టంభనను తొలగించేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ సోమవారం పార్టీలతో నిర్వహించిన భేటీలో కాంగ్రెస్‌కు ఈ పరిణామం ఎదురైంది.
ప్రతిష్టంభన తొలగిపోవాలంటే తమ డిమాండ్లు ఏమిటో కాంగ్రెస్ నేతలు చెప్పాలని, ఆ ఆరోపణలపై సంబంధిత మంత్రి, ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు అనుమతించాలని ఎస్‌పీ చీఫ్ ములాయంసింగ్‌యాదవ్ పేర్కొన్నారు. గత వారంలో కాంగ్రెస్ సభ్యులు 25 మందిని స్పీకర్ సస్పెండ్ చేసినపుడు ఆ పార్టీకి ఎస్‌పీ సంఘీభావం తెలపటమే కాకుండా.. లోక్‌సభ సమావేశాలను కూడా బహిష్కరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ డిమాండ్లు ఏమిటో తనకు తెలియదని.. ఆ పార్టీ డిమాండ్ ఏమిటో వెల్లడించనపుడు తమ పార్టీ వైఖరి ఏమిటనేది చెప్తామని ములాయం పేర్కొన్నట్లు సమాచారం. సభలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుందని.. సభ జరగకుండా కాంగ్రెస్ ఎలా గందరగోళం సృష్టిస్తుందని ఆయన అఖిలపక్ష సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ సభలో మాట్లాడాలని, అప్పుడు ఇతర పార్టీలు తమ మద్దతు గురించి నిర్ణయించుకుంటాయని.. కాంగ్రెస్ అలా మాట్లాడని పక్షంలో సభను బహిష్కరించి నేరుగా ప్రజల వద్దకు వెళ్లాలని ములాయం పేర్కొన్నారు. ఐపీఎల్ వివాదం నేపథ్యంలో తలెత్తిన అంశాలపై 193 నిబంధన కింద చర్చకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా సభ సాగాలని.. అయితే 193 నిబంధన కింద కాకుండా, కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత చర్చ జరపాలని ఆ పార్టీ పేర్కొందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత మల్లికార్జునఖర్గే, ఆర్‌జేడీ, జేడీయూ, టీఎంసీ, ఎన్‌సీపీ, ఆప్ నేతలు హాజరయ్యారు.