కోల్‌కతా: కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను పక్కనబెడతామన్నారు. జీవం కోల్పోయిన ఆ పార్టీ కోసం వేచి చూడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ వ్యవస్థాగతంగా గెలవగలిగే స్థితిలో ఉండేది. ఆ పార్టీ ఇప్పుడు ప్రతి చోటా ఓటమి చవిచూస్తోంది. గెలుపుపై ఆ పార్టీ నేతలకు ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది.
విశ్వసనీయత కోల్పోయిన ఆ పార్టీపై ఆధారపడటంలో అర్థం లేదు’అని తెలిపారు. బలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తే మరింత శక్తివంతంగా మారవచ్చునని చెప్పారు. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో మళ్లీ అధికారంలోకి రాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతుండగా, మమతా బెనర్జీ కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని కావాలనుకుంటున్నారనీ, ఇద్దరికీ తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
ఓట్లు లూటీ చేసి బీజేపీ గెలిచింది
యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజా తీర్పుకి అద్దం పట్టడం లేదని మమతా బెనర్జీ అన్నారు. కాషాయ కూటమి ఎన్నికల యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. అందుకే సమాజ్‌వాదీ ఓడిందన్నారు. బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు. ‘‘ఏదో కొన్ని రాష్ట్రాల్లో నెగ్గామని బీజేపీ గొంతు పెంచొద్దు. ఈ విజయం ప్రజాతీర్పుకు నిదర్శనం కాదు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు. బీజేపీ పగటి కలలు ఆపాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment