బెంగాల్‌ను అస్థిరపరిచేందుకు
కేంద్ర ప్రభుత్వం కుట్ర
సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడే వారిని వదిలేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకు బీఎస్‌ఎఫ్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సరిహద్దులు దాటి ఇక్కడి వచ్చే సంఘ వ్యతిరేక శక్తులు నేరాలకు పాల్పడి, మళ్లీ వెళ్లిపోతున్నారన్నారు. బీఎస్‌ఎఫ్ చర్యల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తముందని తనకు అనుమానంగా ఉందని చెప్పారు.
సరిహద్దు జిల్లాల్లోని కొందరు మేజిస్ట్రేట్లు, ఎస్‌పీలు సరిహద్దు బలగాల అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఇస్లాంపూర్, సిటాయ్, చోప్రా వంటి సరిహద్దుల ప్రాంతాల ద్వారా ప్రవేశించే చొరబాటుదార్లకు బీఎస్‌ఎఫ్ సాయం చేస్తున్నట్లు మాకు సమాచారముంది. బీఎస్‌ఎఫ్ జవాన్లు మహిళలను చిత్ర హింసలకు గురిచేస్తూ, రాష్ట్రాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సెక్రటేరియట్‌లో జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం మమత వ్యాఖ్యానించారు.
‘సరిహద్దుల రక్షణ బాధ్యత బీఎస్‌ఎఫ్‌దే, మాది కాదు. వీసాల జారీ కూడా కేంద్రమే చూసుకుంటుంది. విమానాల్లో ఇక్కడికి వచ్చే వారి సమాచారం మాకు అందజేస్తారు. ఇప్పుడు అది కూడా మేం తీసుకోవడం లేదు. దీంతో, రాష్ట్రానికి ఎవరు వస్తున్నారో మాకు తెలీదు. అయినప్పటికీ చొరబాట్ల వ్యవహారాన్ని కేంద్రం మాపై నెట్టేయాలని చూస్తోంది. రాష్ట్రాన్ని ఎవరైనా అస్థిరపరిచేందుకు చూస్తే టీఎంసీవైపే వేలెత్తి చూపుతోంది. అందుకే మేం చెప్పేది ఒక్కటే.
చొరబాట్లకు బీఎస్‌ఎఫ్‌దే బాధ్యత. టీఎంసీది కాదు. కానీ, కొన్ని టీవీ చానెళ్లు టీఆర్‌పీ కోసం మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి’ అని తెలిపారు. ఇలాంటి చర్యలకు ని రసనగా కేంద్రానికి లేఖ రాస్తానన్నా రు. సీఎం మమత వ్యాఖ్యలను బీఎస్ ఎఫ్ ఖండించింది. తమ జవాన్లు సరి హద్దుల రక్షణలో అత్యంత అప్రమ త్తత, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నా మని తెలిపింది. బీఎస్‌ఎఫ్ పోస్టుల ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు సైతం నిరాకరించిన మమత తన యంత్రాంగం చేతికానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీఎస్‌ఎఫ్‌పై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శించారు. ఆమె భ్రమల్లో గడుపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment