దుష్టపన్నాగాలను తిప్పికొట్టండి: కేసీఆర్‌ | cm kcr slams opposition congress | Sakshi
Sakshi News home page

దుష్టపన్నాగాలను తిప్పికొట్టండి: కేసీఆర్‌

Published Wed, Aug 2 2017 8:18 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

దుష్టపన్నాగాలను తిప్పికొట్టండి: కేసీఆర్‌ - Sakshi

దుష్టపన్నాగాలను తిప్పికొట్టండి: కేసీఆర్‌

- విపక్ష కాంగ్రెస్‌ పార్టీపై  ముఖ్యమంత్రి ఫైర్‌
- అభివృద్ధికి ఆటంకాలా? రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తారా?
- విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులపై హైకోర్టు తీర్పు హర్షణీయం


హైదరాబాద్‌:
అధికారంలోకి వస్తామనుకుని భంగపడ్డ కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి మంచిపనికీ అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.

ప్రాజెక్టులు, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఇలా అన్నిటికి అన్ని విషయాల్లోనూ కోర్టులకు వెళ్లి కాంగ్రెస్‌ కేసులు వేస్తోందని, విపక్షపార్టీ తీరుతో అన్నిపనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ దుష్టపన్నాగాలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

‘ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులపైనే 164 కేసులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనైతే 20 రోజుల వ్యవధిలో ఆరు కేసులు వేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు, డిపెండెంట్‌ ఉద్యోగాలిస్తామంటే కేసులు, విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటే కేసులు.. అసలు దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణలో నెలకొంది. ఆ పార్టీ వల్ల లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు, కార్మికుల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ శిఖండి పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి. ఎక్కడికక్కడ నిలదీయాలి’ అని కేసీఆర్‌ అన్నారు.

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. హైకోర్టుకు ధన్యవాదాలు
ట్రాన్స్‌కో, జెన్‌కోలతోపాటు రెండు డిస్కంలలో కాంట్రాక్టర్ల కింద పనిచేస్తోన్నవారిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రక్రియపై స్టేను ఎత్తివేసిన హైకోర్టుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. నిజానికి వారిని క్రమబద్ధీకరించలేదని, కాంట్రాక్టర్ల చెర నుంచి విడిపించి, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విధానాన్ని రూపొందించామని వివరించారు. ఈ విషయంలో కోర్టు మానవతాధృక్ఫథంతో ఆలోచించిందని, ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్న సీఎం.. ప్రభుత్వ లాయర్లు అద్భుతంగా వాదించారని కితాబిచ్చారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై..
ఎన్నికల హామీ మేరకు సింగరేణిలో వారసత్వం ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినా, కోర్టు ఉత్తర్వుల వల్ల ప్రక్రియ నిలిచిపోయిందని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. అయితే, ప్రక్రియను తిరిగి పునరుద్ధరించేలా సింగరేణి వరకు ప్రత్యేక చట్టం తేవాలా? లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూపాలా? అనేదానిపై అధికారులతో చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు. నిజానికి బొగ్గుబావుల్లో ఉద్యోగంచేసేవారు.. దేశాన్ని కాపాడే జవాన్లకంటే ఏమాత్రం తక్కువ కాదని, అందుకే వారసత్వ ఉద్యోగాల కల్పనలో వీరిని ప్రత్యేకంగా పరిగణించాలని గతంలో(నాటి ప్రధాని మన్మోహన్‌కు) లేఖరాసినట్లు కేసీఆర్‌ చెప్పారు.

గూర్ఖాలాండ్‌ ఉద్యమానికి మద్దతుపై..
పశ్చిమ బెంగాల్‌ నుంచి విడదీసి ప్రత్యేక గూర్ఖాల్యాండ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఉధృతంగా సాగుతోన్న ఉద్యమంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఉద్యమంపై విధానపరమైన నిర్ణయమేదీ తీసుకోలేదని, అలా తీసుకోలేక పోవడానికి కూడా కారణాలున్నాయని వివరించారు. ‘గూర్ఖాలాండ్‌ అంతర్జాతీయ సరిహద్దులో ఉంది. ఉన్నట్లుండి ఇప్పుడే ఉద్యమం ఉధృతం కావడం వెనుక చైనా హస్తం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. గూర్ఖాలాండ్‌ ఏర్పడితే ఈశాన్య రాష్ట్రాల్లో కల్లోలం చెలరేగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఒకవేళ మా స్టాండ్‌ చెప్పాల్సి వస్తే పార్టీలో చర్చించి చెబుతాం’ అని కేసీఆర్‌ అన్నారు.

సీట్లు పెంచినా లేకున్నా ఒకటే
‘కొత్త రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని చట్టంలో ఉంది. కానీ డ్రాఫ్టులో పొరపాట్ల వల్ల ఆ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడ్డాయి. మొన్న ప్రధాని మోదీని కలిసినప్పుడు దీనిపై మాట్లాడాను. మావరకైతే సీట్లు పెంచినా, లేకున్నా ఒకటే. కానీ కేంద్రం వైపు నంచి సందిగ్ధత తొలగించాలని ప్రధానిని కోరా’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీట్లు పెరగకపోయినప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు ఉండవని, రాజకీయంగా స్థిరంగా కొనసాగుతున్నామని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement