పార్లమెంట్ ప్రతిష్టంభనపై అధికార, విపక్షాల పరస్పర నిందలు
న్యూఢిల్లీ: పార్లమెంటు కార్యక్రమాల ప్రతిష్టంభనపై అధికార, విపక్షాలు పరస్పర నిందారోపణలు ప్రారంభించాయి. ప్రతిష్టంభనలో ప్రభుత్వం తప్పు లేదని, విపక్ష కాంగ్రెస్, వామపక్షాలే దానికి కారణమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించగా.. ప్రధాని మోదీ అహంకారం, మొండి పట్టుదల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ఎదురుదాడి చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, సభను సజావుగా నడిపేందుకు సోమవారం మరోసారి అఖిలపక్ష భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రతిష్టంభనపై అన్ని విపక్ష పార్టీలతో చర్చించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నామని, శుక్రవారం కూడా అన్ని పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా, కాంగ్రెస్ ముందుకురాలేదని వెంకయ్య చెప్పారు. 14 నెలల బీజేపీ పాలనలో అవినీతి ఆరోపణలేవీ రాలేదని శుక్రవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘రెండు వారాలు సభను అడ్డుకోవడంతో కాంగ్రెస్ సంతోషంగా ఉంది. కానీ వారు దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని గుర్తించలేకపోతున్నార’ని అన్నారు.
సభాకార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి జీతభత్యాల్లో కోత విధించాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. అలాంటి డిమాండ్లు మరిన్ని రావాలన్నారు. ప్రభుత్వం జరపనున్న అఖిలపక్ష భేటీపై కాంగ్రెస్ స్పందించింది. మోదీగేట్‌లో పాత్ర ఉన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లు రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై ప్రధాని నుంచి కచ్చితమైన హామీ లభిస్తేనే.. అఖిల పక్ష భేటీకి వెళ్తామని చెప్పంది. ‘ఫొటోలు, టీ, శాండ్‌విచ్‌ల మొక్కుబడి భేటీపై మాకు ఆసక్తి లేదు’ అని ఆనంద్ శర్మ అన్నారు.
మీ వల్లే.. కాదు మీ వల్లే!
Published Sat, Aug 1 2015 12:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement