సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
లెఫ్ట్‌తో ‘లెఫ్టా.. రైటా?’
లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది.
వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు?
చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్‌ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్‌లోని వివేక్ ఫాంహౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్‌లు భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment