గుజరాత్‌లో తప్పనిసరి ‘ఓటు’
రాజ్‌కోట్/అహ్మదాబాద్: గుజరాత్‌లో వచ్చే అక్టోబర్ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ‘తప్పనిసరి ఓటు’ నిబంధనలు ప్రవేశపెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను బీజేపీ సర్కారు తోసిపుచ్చింది. ‘‘ఓటు వేయటం తప్పనిసరి చేస్తూ బిల్లుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ చట్టాన్ని కార్పొరేషన్, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తాం. ఓటు వేయని వారి కోసం మేం నిబంధనలు రూపొందిస్తున్నాం.
వాటిని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ముఖ్యమంత్రి ఆనందీబెన్ పాటిల్ గురువారం రాజ్‌కోట్‌లో విలేకరులకు తెలిపారు. ఇలాంటి చట్టం నియంతృత్వ పాలనకు ప్రతీక అని ప్రతిపక్షనేత శంకర్‌సింగ్‌వాఘేలా విమర్శించారు.