సభలో ఇక సమరమే...
* అధికార - విపక్షాల మధ్య సయోధ్య మృగ్యం
* ప్రతిష్టంభనతో ముగిసిన అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య సమరం ఖరారయింది. లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలపై పాలక, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు పదవుల నుంచి వైదొలగకపోతే సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ స్పష్టంచేయగా.. అటువంటి రాజీనామాలు ఏవీ ఉండబోవని, ఎవరి హెచ్చరికలకూ తాము లొంగబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
పార్లమెంటు నిర్వహణ సమష్టి బాధ్యత అని, అందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. మంగళవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నిర్వహణలో ఒకటి, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహణలో మరొకటి.. మొత్తం రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఈ రెండు భేటీల్లోనూ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షం..తమ వైఖరులపై భీష్మించటంతో ఆ భేటీలు ప్రతిష్టంభనతో ముగిశాయి.
వెంకయ్య నిర్వహించిన అఖిలపక్ష భేటీలో.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లయితే.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి రైల్వేమంత్రి పవన్‌కుమార్ బన్సల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌లపై ఆరోపణలు వచ్చినపుడు వారు ఎలా రాజీనామా చేశారో ఆయన ఉదహరించారు. వ్యాపమ్ కుంభకోణంలో వరుస మరణాలను ఖండిస్తూ.. పాకిస్తాన్ ఐఎస్‌ఐ కానీ, ఇక్కడి ఉగ్రవాదులు లేదా నక్సలైట్లు కానీ ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోందా అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన హామీలను గుర్తుంచుకుని అవినీతిపై మాటలను చేతల్లో చూపించాలని కాంగ్రెస్ సూచించింది. ఆజాద్ డిమాండ్లను వెంకయ్య తిరస్కరించారు. ‘ఎవరి నుంచైనా తుదిహెచ్చరికలను అంగీకరంచేది లేదు. రాజీనామా అనే ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ప్రభుత్వానికి ఎవరూ షరతులతో ఆజ్ఞలు జారీచేయజాలరు. ప్రభుత్వం నుంచి ఏ కేంద్రమంత్రి కూడా అక్రమమైన, అనైతికమైన పని ఏదీ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. లలిత్‌మోదీ వివాదంపై సుష్మాస్వరాజ్ సభలో ప్రకటన చేస్తారని చెప్పారు.
సమావేశాలు సాగకపోతే.. చర్చించేదెలా?
కాంగ్రెస్, జేడీ(యూ), ఎస్‌పీ, బీఎస్‌పీ, ఆర్‌జేడీ, డీఎంకే, వామపక్షాలు, ఎన్‌డీఏ మిత్రపక్షాలు సహా 29 పార్టీల నుంచి పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ 42 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనలేదు.
అయితే.. వసుంధర, చౌహాన్‌లు ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయకపోతే సమావేశాలను సాగనివ్వబోమన్న కాంగ్రెస్ వైఖరితో సమావేశానికి హాజరైన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏకీభవించలేదు. పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవటం పరిష్కారం కాబోదని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ వైఖరి గురించి ప్రస్తావించగా.. ‘ఇది సరికాదు. పార్లమెంటు జరుగుతుంది. ప్రభుత్వం చర్చకు అనుమతించాలి’ అని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లును తాము అంగీకరించేది లేదన్నారు.
సమావేశాలు సజావుగా సాగుతాయా అన్నది అనుమానమేనని ఎస్‌పీ నేత రాంగోపాల్‌యాదవ్ స్పందించారు. ఆజాద్ లేవనెత్తిన అంశాలపై చర్చజరగాలని.. పార్లమెంటు పనిచేయకుండా అడ్డుకుంటే చర్చ ఎలా జరుగుతుందని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా వ్యాఖ్యానించారు. భారత్ - పాక్ సరిహద్దులో సంఘటనలపై చర్చ జరగకుండా పార్లమెంటుకు ఆటంకం కలిగించేవారిని జాతి క్షమించదని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై సవివరమైన చర్చ జరగాలని టీఆర్‌ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. చర్చల ద్వారా స్పష్టత వచ్చేందుకు వీలుగా వివిధ అంశాలపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని సీపీఎం నేత సీతారాంఏచూరి కోరారు.
చర్చకు ప్రతిపాదించిన అంశాలివీ...
సమావేశాల్లో చర్చించటానికి ప్రతిపాదించిన అంశాల్లో.. భారత్, పాక్ సంబంధాలు - విదేశాంగ విధానం, పెరుగుతున్న సామాజిక అంతరాలు, రైతుల ఆత్మహత్యలు - వ్యవసాయ రంగ సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - దాని అమలు, పదోన్నతుల్లో ఎస్‌సీలు, ఎస్‌టీలకు రిజర్వేషన్లు, పొగాకు రైతుల సమస్యలు, సామాజిక - ఆర్థిక కుల గణన తదితర అంశాలున్నాయి.
కాంగ్రెస్ చేతిలో బ్రహ్మాస్త్రాలు..!
సుష్మాస్వరాజ్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెల్ డాక్యుమెంట్స్‌లభించేలా సహకరించారన్న ఆరోపణలతో వివాదం రేగింది. మోదీ భార్య కేన్సర్ చికిత్సకు పోర్చుగల్ వెళ్లడం కోసం మోదీ కోరడంతో మానవతా దృక్పథంతోనే సాయం చేశానని సుష్మా వివరణ ఇచ్చినప్పటికీ.. విపక్షం శాంతించలేదు.
వసుంధర రాజె: ‘లలిత్‌గేట్’లో రెండో వికెట్. తన బ్రిటన్ ఇమిగ్రేషన్‌కు సాక్షిగా వచ్చేందుకు రాజె ఒప్పుకున్నారని, ఈలోపు ఆమె సీఎం కావడంతో కుదరలేదని లలిత్ ట్వీట్‌తో రాజె ఇందులో ఇరుక్కున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్: వ్యాపమ్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పె భారీ ఎత్తున బురదజల్లిన కుంభకోణం. వైద్య విద్యలో ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో నియామకాల్లో జరిగిన రూ.కోట్ల స్కాం చౌహాన్ ఇమేజిని దారుణంగా దెబ్బతీసింది. నిందితులు, సాక్ష్యులు.. దాదాపు 50 మంది అనుమానాస్పదంగా మృతి చెందడం ఈ స్కాంలోని చీకటి కోణాలను బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రభుత్వ, పార్టీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో శివరాజ్ సింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పట్టుపడుతోంది.
భూబిల్లుపై సర్దుకుపోవాలి: మోదీ
దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన తొలి అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ కొద్దిసేపు పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటు సజావుగా సాగటానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అది సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. భూబిల్లుపై సర్దుకుపోవాలన్నారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై అన్ని రాజకీయ పార్టీలూ సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్లమెంటు సమయాన్ని అన్ని అంశాలనూ చర్చించేందుకు వినియోగించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ఆగస్ట్ తొలివారంలో ‘భూ’ నివేదిక
* మరింత గడువు కోరిన జేపీసీ
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పించే గడువును ఆగస్టు మొదటివారం వరకు పొడగించినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. నివేదికను పార్లమెంటు వర్షాకాల స మావేశాల తొలిరోజైన జూలై 21వ తేదీన సమర్పించాల్సి ఉండగా మొదట జూలై 27 వరకు గడవును పొడగించాలని కమిటీ చైర్మన్ అహ్లూవాలియా(బీజేపీ) అభ్యర్థించారని, మరోసారి పొడిగింపును కోరుతూ తాజాగా లేఖ రాశారని వివరించారు.
దాంతో ఆగస్ట్ తొలివారం వరకు గడవును పొడగించామని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలపై మరింత వివరణ కావాలని జేపీసీ సభ్యులు కోరుతున్నందున నివేదిక సమర్పణకు గడువు కావాలని అహ్లూవాలియా కోరారన్నారు. జూలై 6న జేపీసీ ముందు హాజరుకావాల్సి ఉన్న వివిధ శాఖలకు చెందిన ముగ్గురు కార్యదర్శులు గైర్హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆగస్ట్ 3 వరకు గడువు కో రుతూ రేపు(బుధవారం) అహ్లూవాలియా లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారని వెల్లడించాయి. అయితే, ఈ గడువులోపు కూడా ని వేదిక సిద్ధం కాకపోవచ్చని, మరోసారి గడువు పొడగింపును జేపీసీ కోరవచ్చని పేర్కొన్నాయి. అదే జరిగితే, భూ ఆర్డినెన్సును ప్రభుత్వం మరోసారి(4వ సారి) జారీ చేయాల్సి వస్తుంది.
భూబిల్లును వ్యతిరేకించడమంటే అభివృద్ధిని వ్యతిరేకించడమే
భూ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడాన్ని వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అది రైతు వ్యతిరేకత, అభివృద్ధి వ్యతిరేకత అని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా రైతుల నుంచి సేకరించనివ్వబోమన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాళ్లు అధికారంలో ఉండగా సరైన పరిహారం ఇవ్వకుండానే 20 లక్షల ఎకరాల భూమిని పరిశ్రమలకు, ఎస్‌ఈజీలకు కట్టబెట్టారంటూ ట్వీట్ చేశారు.
పార్లమెంటుకు విదేశీ అధికారుల లంచాల బిల్లు
న్యూఢిల్లీ: లంచం ఇవ్వజూపే లేదా తీసుకునే విదేశీ ప్రభుత్వాధికారులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కాలవ్యవధి ముగిసింది. దీంతో తాజాగా దీన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన ప్రభుత్వం...ఈ బిల్లుపై సూచనలు, అభిప్రాయాలు తెలపాల్సిందిగా లా కమిషన్‌ను కోరింది. అయితే మంగళవారం పార్లమెంటులో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందా లేదా అనే విషయం తెలియరాలేదు.