వరుసగా డాక్టర్లు కూడా..
ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, బడా వ్యాపారవేత్తల ప్రమేయం ఉన్న 'వ్యాపం' కుంభకోణంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. సాక్షులు, నిందితుల ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కుంభకోణం దర్యాప్తునకు సహకరిస్తున్న డాక్టర్లూ బలవుతున్నారు. ఈ కుంభకోణంపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు సహకరించడంలో భాగంగా భారత వైద్యమండలి తరఫున అగర్తలాకు వెళ్లాల్సిన జబల్పూర్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఆదివారం ఢిల్లీ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి 200 పేజీల సమాచారాన్ని ఆయన ఎస్టీఎఫ్‌కు ఇచ్చినట్టు సమాచారం. రిగ్గింగ్ ద్వారా మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందినవారి వివరాలు అందులో ఉన్నట్టు తెలుస్తోంది.
డాక్టర్ అరుణ్ శర్మకు ముందు జబల్పూర్ వైద్యకళాశాలకు డీన్‌గా పని చేసిన డాక్టర్ డీకే శకల్లే కూడా ఏడాది క్రితం, అంటే జూన్ 28వ తేదీన అగ్నికి ఆహుతయ్యారు. చైనా తయారీ లేజర్ గన్ ద్వారా ఆయనను కాల్చివేసినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆయన కూడా ఇదే కుంభకోణం కేసు విచారణలో దర్యాప్తు సంస్థ స్పెషల్ టాస్క్ఫోర్స్‌కు సహకరించారు. తర్వాత ఇదే కేసుతో సంబంధం ఉన్న గ్వాలియర్ ఆస్పత్రి డాక్టర్ రాజేంద్ర ఆర్య, పశువైద్యుడు నరేంద్ర సింగ్ థోమర్‌లు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. ఇదే కేసులో అక్రమ అడ్మిషన్లు రద్దయిన విద్యార్థుల నుంచి వస్తున్న బెదిరింపులను తట్టుకోలేక బుందేల్‌ఖండ్ వైద్య కళాశాల డీన్ డాక్టర్ ఎల్పీ వర్మ నెల రోజులు సెలవుపై వెళ్లడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.