
వ్యాపంలో మరో అనుమానాస్పద మరణం
మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసులో మరో మరణం నమోదైంది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన 'వ్యాపం' కేసులో మరో మరణం నమోదైంది. ఒడిషాకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్ బహదూర్ (ఐఎఫ్ఎస్) అనుమానాస్పదంగా శవమై తేలారు. భోపాల్ సమీపంలోని రాయఘడ్కు వెళ్లిన ఆయన మృతదేహాన్ని అక్టోబర్ 15 ఉదయం ఝార్సుగూడ రైల్వే ట్రాక్పై పోలీసులు కనుగొన్నారు. దీంతో ఈ కుంభకోణంలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారి సంఖ్య 51కి చేరింది. కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత నమోదైన తొలి అనుమానాస్పద మరణం ఇదే.
1978 బ్యాచ్కి చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సమావేశానికి హాజరయ్యేందుకు విజయ్ బహదూర్, భార్య నీతాసింగ్తో కలిసి పూరీ వెళ్లారు. తర్వాత తిరిగి భోపాల్ వస్తుండగా ఈ మరణం సంభవించింది. అయితే ఏసీ కంపార్ట్మెంట్లో తలుపు మూయడానికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని నీతూ చెబుతుంటే.. ప్రమాదవశాత్తూ రైల్లోంచి కిందపడి చనిపోయారని జిల్లా ఎస్పీ దిలీప్ బాగ్ చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.
కాగా 2012లో ఈ కేసులో ప్రధాన సాక్షి నమ్రతా దామోర్ కూడా రైల్వేట్రాక్పై శవమై తేలారు. మరోవైపు వ్యాపం కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు... దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఇటీవల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల మరణాలపై సీబీఐ విచారణ చేపట్టింది. ఆ తర్వాతి నుంచి అనుమానాస్పద మరణాలు దాదాపు తగ్గిపోయాయి. కానీ మళ్లీ ఇప్పుడు మరో మరణం వెలుగుచూడటం ఆందోళనలు రేపుతోంది. కేసును తారుమారు చేసేందుకే సాక్షులను ఒక్కొక్కరిని హతమారుస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలకు దిగిన విషయం తెలిసిందే.