
'వ్యాపం' కేసులో మరో అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ వ్యాపం (వ్యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణంతో సంబంధం ఉన్న మరొకరు ఆదివారం ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. కుంభకోణాన్ని దర్యాప్తుచేస్తోన్న ఉన్నతాధికారుల బృందంలో సభ్యుడు, జబల్ పూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ అరుణ్ శర్మ ఢిల్లీలో శవంగా కనిపించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఉప్పల్ హోటల్ లోని తన గదిలో విగతజీవిగా పడిఉన్న ఆయనను హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహం పక్కనే కొన్ని మందులతోపాటు మద్యం సీసాను గుర్తించామని, కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు సంభవించాయి. పలువురు నిందితులు, సాక్షులు అంతుచిక్కని రీతిలో చనిపోతున్నారు. కాగా, ఈ అనుమానాస్పద మరణాలన్నింటిపై దర్యాప్తు జరిపిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.