ఇంకా ఎంతమంది మరణిస్తారో!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ (వ్యావసాయక్ పరీక్షా మండల్ లేదా మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన 30 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ నరేంద్ర తోమర్ శనివారం రాత్రి ఇండోర్ జిల్లా జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, బెయిల్‌పైనున్న మరో నిందితుడు రాజేంద్ర ఆర్య (40) కూడా ఇటీవలనే ఆర్ధాంతరంగా చనిపోవడం కలకలం రేపింది. నత్తనడక నడుస్తున్న కేసు విచారణను తట్టిలేపింది. ముఖ్యంగా పరారీలోవున్న తోమర్ గత ఫిబ్రవరిలోనే అరెస్టుకావడం, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఎలాంటి గుండె జబ్బులేని తోమర్ గుండె జబ్బుతో మరణించాడని పోలీసులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తెరతీసింది. 2009లో వ్యాపమ్ నిర్వహించిన వైద్య విద్యా పరీక్షల్లో అభ్యర్థుల స్థానంలో ప్రొఫెషనల్స్‌ను పెట్టి రాయించారన్నది తోమర్‌పై ప్రధాన ఆరోపణ.
2013 నుంచి కేసు విచారణ జరుగుతున్న ఈ కేసులో గత ఐదేళ్ల నుంచి ఇప్పటి వరకు నిందితులు, సాక్షులను కలిపి చూస్తే 25 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అనధికార లెక్కల ప్రకారం మాత్రం దాదాపు 40 మంది చనిపోయారు. రాజేంద్ర ఆర్య మరణానికి ముందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అనుమానాస్పద పరిస్థితుల్లో 23 మంది సాక్షులు, నిందితులు మరణించారని కేసు దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న మధ్యప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. నిందితుల్లో ఒకడైన అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కూడా ఈ కేసులో సంచలనమే. పరువుపోతుందన్న కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తులు వచ్చాయి. ఏది నిజమో, కేసు ఎటు పోతుందో కూడా కేసు దర్యాప్తు చేస్తున్న రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. అనూజ్, అంశూల్ సచన్, శ్యామ్‌వీర్ యాదవ్ అనే ముగ్గురు 2010, జూన్ 14వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ కేసులో అనుమానాస్పద మరణాలు మొదలయ్యాయి.
2009లో జరిగిన ఈ కుంభకోణం 2013లో ఇండోర్ మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుతో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు 1800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరెస్టుకాగా, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కలుపుకొని 129 మంది అరెస్టయ్యారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది బీజేపీ నాయకులే ఉన్నారు. ఓ ప్రొఫెషనల్ అడ్మిషన్ల కేసులో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం చోటుచేసుకోవడం, ఇంతమంది అరెస్టు అవడం దేశంలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎంతోమంది రాజకీయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం, ఎక్కువ మంది నిందితులు, సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడమూ కూడా దేశంలో మొదటిసారే. ఈ కేసు కారణంగానే అప్పటి మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖా మంత్రి లక్ష్మీకాంత్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ వ్యాపమ్ కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిచయస్తులు కూడా ఉండడంతో ఈ కుంభకోణంలో ఆయనకు కూడా ప్రమేయం ఉందన్న ఆరోపణలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుదు దిగ్విజయ్ సింగ్ ఆదివారం నాడు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌ను ఆ రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ సోమవారం నాడు నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. కేసుతో సంబంధం ఉండి, మరణించిన నిందితులు, సాక్షులది సహజమరణమేనని, తోమర్ మరణం కూడా సహజమైనదేనని ఆయన స్పష్టం చేశారు. తోమర్ అటాప్సీ నివేదిక రాకముందే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేసు విచారణ ముగిసి ప్రధాన చార్జిషీటు దాఖలు చేసేలోగా ఇంకా ఎంతమంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తారో తెలియదు. జూలై 15వ తేదీన కేసులో ప్రధాన చార్జిషీటు దాఖలు చేస్తామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు గతంలో ఆ రాష్ట్ర హైకోర్టుకు హామీ ఇచ్చారు. మరేం అవుతుందో చూడాలి.