ఒక సక్సెస్ వెనుక.. ఫెయిల్యూర్ స్టోరీ | vyapam scam.. A girl success story | Sakshi
Sakshi News home page

ఒక సక్సెస్ వెనుక.. ఫెయిల్యూర్ స్టోరీ

Published Fri, Jul 10 2015 2:36 PM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

ఒక సక్సెస్ వెనుక.. ఫెయిల్యూర్ స్టోరీ - Sakshi

ఒక సక్సెస్ వెనుక.. ఫెయిల్యూర్ స్టోరీ

ప్రతి మనిషి విజయాల వెనక అపజయాలు ఉంటాయన్నది అందరికి తెల్సిందే. ఆ అపజయాల వెనక వ్యవస్థీకృత అవినీతి దాగింటుందన్నది పూనం శర్మ సక్సెస్ స్టోరీ చెబుతోంది. ఆమె తండ్రి జూనియర్ పోలీసు అధికారి. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నివాసం. డాక్టర్ కావాలని కలలు కన్నది. గ్వాలియర్‌లో మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయని తెలుసుకొని 2009లో అక్కడికి మారింది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. ఎంబీబీఎస్ పరీక్ష కోసం ఏడాది పాటు కోచింగ్ తీసుకుంది. రోజుకు 14 గంటల చొప్పున కష్టపడి చదువుతూ వచ్చింది. వైద్యకోర్సులో ప్రవేశానికి పరీక్ష దగ్గరపడింది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందన్న అనుమానం ఆమెకు వచ్చింది.


చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తే తన తోటి విద్యార్ధుల్లో అడ్మిషన్ టెస్టులో సులభంగా పాస్ అవుతామనే ధీమా ఆమెకు కనిపించింది. మెల్లగా తనతో చనువుగా ఉండేవారిని కదిలించింది. . వారి ధీమాకు కారణం ఏమిటని వాకబు చేసింది. జనరల్ క్యాటగిరీలో సీటుకు 12 లక్షల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీ సీట్లకు మూడు, నాలుగు లక్షల రూపాయలు చెల్లించినట్టు వారి నుంచి సమాధానం వచ్చింది. పరీక్ష రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ తెల్లటి వ్యాన్ వారుంటున్న హాస్టల్ వద్దకు వచ్చింది. డబ్బులు చెల్లించినవారంతా ఆ వ్యాన్‌లో బయల్దేరి వెళ్లారు. వారందరికీ ప్రశ్నపత్రాలు చదువుకోమని తెల్లవారే ఐదు గంటలకే ఇచ్చారని ఆ తర్వాత తెలిసింది. వారితోపాటే పరీక్ష రాసిన పూనం శర్మ ప్రవేశ పరీక్షలో ఫెయిలైంది.

మళ్లీ రెండోసారి కోచింగ్ సెంటర్‌లో చేరి ఇదివరకన్నా ఎక్కువ కష్టపడి చదివింది. మళ్లీ పరీక్షలో ఫెయిలయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె మూడోసారి కోచింగ్ సెంటర్‌లో చేరకుండానే పరీక్షలకు ప్రిపేరయింది. 200 మార్కులకు 162 మార్కులు సాధించింది. ఆ ఏడాది 164 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించడంతో మూడోసారి కూడా సీటు రాలేదు. నాలుగోసారి మళ్లీ ప్రయత్నించి వెయిటింగ్ లిస్ట్‌లో ఆరోస్థానంలో నిలిచింది. వెయిటింగ్‌ లిస్ట్‌పై పోరాటం జరిపింది. లాభం లేకపోయింది. మొత్తం నాలుగేళ్లు కష్టపడి చదివినా వ్యాపం కుంభకోణం కారణంగా ఆమెకు వైద్య కోర్సులో అడ్మిషన్ దొరకలేదు. అయినా నిరాశా నిస్పృహలకు గురికాకుండా 2014లో ఐదోసారి ప్రవేశ పరీక్ష రాసింది. ఈసారి అఖిల భారత స్థాయిలో ఏడో ర్యాంకు సాధించి తాను కోరుకున్న ఇండోర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో సీటు సాధించింది. దీనికి ఆమె కృషి ఒక్కటే కారణం కాదు. పీకలోతు కుంభకోణాల్లో కూరుకుపోయిన వ్యాపం (మధ్యప్రదేశ్ వ్యవసాయక్ పరీక్షా మండల్)ను రద్దు చేసి అఖిల భారత స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించడమే అసలు కారణం.

ఇది ఒక పూనం శర్మ సక్సెస్ స్టోరీ. దీని వెనుక అనేక ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. పూనంలాగా పదే పదే ప్రయత్నించే వయస్సుగానీ, సామాజిక పరిస్థితులుగానీ లేని వారు ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరిపోయారు. అందులో ఒకరు వ్యాపం కుంభకోణానికి వెలికితీసుకొచ్చిన వారిలో ఒకరైన వెటర్నరీ ఫిజీషియన్ ఆనంద్ రాయ్. మరికొందరు డెంటిస్ట్రీ, ఆయుర్వేద, హోమియోపథిలాంటి కోర్సుల్లో చేరిపోయారు. ఇది వారందరి ఫెయిల్యూర్ స్టోరీ. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన తన తోటి విద్యార్థిని అడ్మిషన్ రాక ఆత్మహత్య చేసుకుందని పూనం శర్మ తెలియజేస్తున్నారు. ఇది అలాంటి వారందరి ఫెయిల్యూర్ స్టోరీ. మొత్తంగా ఈ వ్యవస్థ ఫెయిల్యూర్ స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement