
నమ్రతది హత్యే: వైద్యుల నిర్ధారణ
వ్యాపం స్కాంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆత్మహత్యగా కొట్టిపారేసిన నమ్రత అనే 19 ఏళ్ల వైద్యవిద్యార్థినిది హత్యేనని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు చెబుతున్నారు. అది సహజ మరణం కావడానికి ఒక్కశాతం కూడా అవకాశం లేదని నమ్రతా దామర్ అనే ఆ అమ్మాయికి పోస్టుమార్టం చేసిన వైద్య బృందంలోని డాక్టర్ బీబీ పురోహిత్ చెప్పారు. వాస్తవానికి నమ్రత మూడేళ్ల క్రితమే మరణించినా.. ఆ విషయం గురించి ఆరా తీసేందుకు ఆమె తండ్రి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన విలేకరి అక్షయ్ సింగ్ అత్యంత అనుమానాస్పద రీతిలో ఆమె ఇంటిముందే మరణించడంతో నమ్రత మరణం విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
నమ్రత 2012 జనవరి నెలలో ఉజ్జయినిలోని రైల్వే పట్టాల వద్ద మరణించి కనిపించింది.ఈ కేసును విచారించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి.. 2014లో కేసును మూసేశారు. అయితే.. ముగ్గురు వైద్యుల బృందం ఆమెకు పోస్టుమార్టం చేసిందని, తమకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉందని డాక్టర్ పురోహిత్ తాజాగా వెల్లడించారు. ఆమె ముక్కుమీద, నోటిమీద గాయాలున్నాయని, దాన్ని బట్టి చూస్తే ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అలాగే, ఆమె మరణించిన తర్వాత మృతదేహాన్ని రైలుపట్టాల మీదుగా లాక్కెళ్లినట్లు కూడా శరీరం మీద గాయాలను బట్టి స్పష్టం అవుతోందన్నారు. కాగా, నమ్రత అక్రమ మార్గంలో మెడిసిన్ సీటు సంపాదించిందన్న ఆరోపణలున్నాయి.