
చాయ్ వాలాకు సీబీఐ కోర్టు సమన్లు
కాన్పూర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్ కేసులో చాయ్ వాలాకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కాన్పూర్ లోని లాలాలజపతి రాయ్ ఆస్పత్రి ఎదుట టీ అమ్ముకుని జీవిస్తున్న రాజుకు కోర్టు సమన్లు పంపింది. జనవరి 13న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటివరకు గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్(జీవీఎస్‌ఎం) కాలేజీ విద్యార్థులపైనే దృష్టి సారించిన సీబీఐ చాయ్ వాలాకు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, తనకు సీబీఐ కోర్టు సమన్లు పంపడంపై రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఏ తప్పు చేయలేదని, వ్యాపం కుంభకోణం గురించి అసలు తనకేమీ లేదని మీడియా ముందు వాపోయాడు. తానెప్పుడు మధ్యప్రదేశ్ కు వెళ్లలేదని చెప్పాడు. లాలాలజపతి రాయ్ ఆస్పత్రి ఔట్ షేపెంట్ విభాగం గేటు వెలుపల 20 ఏళ్లుగా అతడు టీ కొట్టు నడుపుతున్నాడు. రాజుకు సమన్లు పంపడానికి గల కారణాల గురించి సీబీఐ అధికారులు, స్థానిక పోలీసులు పెదవి విప్పడం లేదు.