
విపక్షాలను ఎదుర్కొనేదెలా?
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రేపు మంత్రులు-కార్యదర్శుల సమావేశం
{పభుత్వానికి తలనొప్పిగా మారనున్న వ్యాపమ్-లలిత్‌గేట్
బిల్లుల ఆమోదం కంటే ఆత్మరక్షణే సర్కారు ముందున్న సమస్య
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం విపక్షాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులతో గురువారం(జూలై 16) వ్యూహాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని కుదిపేసిన వ్యాపమ్ స్కామ్, లలిత్ మోదీ వివాదం, కులగణన గణాంకాల వంటి అవకాశాలపై ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. దీంతో పాటు ఈ సమావేశాల్లో చేపట్టాల్సిన వివిధ అంశాలను కూడా ఖరారు చేయనున్నారు. 3 వారాల సాగే వర్షాకాల సమావేశాల్లో సభ ముందుంచటానికి 35 శాసన ఆర్థిక అంశాలను జూలై 9న జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ శాఖలోని శాసన విభాగ కార్యదర్శులతో జరిగిన భేటీలో ప్రభుత్వం గుర్తించింది. గురువారం జరిగే సమావేశంలో వీటికి తుదిరూపాన్నిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో దాదాపు 9 బిల్లులు, లోక్‌సభలో నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా సుమారు 11 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వివాదాస్పదమైన భూసేకరణ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నందున ఈ సమావేశాల్లో చర్చకు రాకపోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నియంత్రణ చట్ట సవరణ బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులు లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నాయి. సమావేశాలకు ముందు రోజు(జూలై 20) లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు.
మోదీతో రాజ్‌నాథ్, జైట్లీ, అమిత్ షా భేటీ
పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు మంగళవారం ప్రధాని మోదీని కలసి చర్చించారు. కాగా, సమావేశాలు వాడివేడిగా జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన మిత్రపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని బలమైన వ్యూహరచన చేయాలని శివసేన హితవు పలికింది.
సోనియాతో రాహుల్ మన్మోహన్ భేటీ
పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మరికొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. వ్యాపమ్, లలిత్‌గేట్, కుల గణన అంశాలపై విపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యూహరచన చేయాలని ఈ భేటీలో కాంగ్రెస్ నిర్ణయించింది. సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ లాంటి పార్టీలు వేరే మార్గం అనుసరించినా.. వీలైనంత వరకు అన్ని పార్టీలను కలుపుకు పోవాలని నిర్ణయించారు.
సభలో సహకరించండి: వెంకయ్య వినతి
వ్యాపమ్, లలిత్ గేట్ వివాదాల నేపథ్యంలో ముంచుకొస్తున్న వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అన్ని పార్టీల నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తుందని చెప్పారు. తానూ జూలై 20న ఉదయం 10 గంటలకు ఉభయసభల్లోని అన్ని పార్టీల నేతలతో సమావేశం అవుతానన్నారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన ప్రధాన అంశాలకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
రాజీనామాల ప్రశ్నేలేదు
లలిత్ వివాదంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తి తలెత్తదని వెంకయ్య స్పష్టం చేశారు. అంతే కాకుండా లలిత్ గేట్‌తో పాటు వివిధ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ముఖ్యమంత్రులు వసుంధ రాజే, శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు సైతం రాజీనామాలు చేయరని తేల్చి చెప్పారు. సుష్మ ఎలాంటి తప్పూ చేయలేదన్నారు.