మణిపూర్‌లోని చురాచాంద్‌పూర్‌లో గురువారం గిరిజన సంఘాల నిరసన
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. దోషులను వదిలిపెట్టేదిలేదని ప్రకటించారు. మే 4వ తేదీన జరిగిన ఈ దారుణ ఉదంతం 140 కోట్ల మంది భారతీయులను తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు జరిగిన అవమానం గురించి తెలిశాక తన హృదయం బాధతో, ఆవేదనతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మోదీ గురువారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడే యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మహిళలకు తగిన భద్రత కలి్పంచాలని సూచించారు. శాంతిభద్రతలను పరిరక్షించే విషయంలో రాజీపడొద్దని, కఠినంగా వ్యవహరించాలని అన్నారు. అమానవీయ ఘటన క్షమించరానిదని, దోషులను వదిలిపెట్టబోమని ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, బిల్లులపై చర్చల కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీలంతా పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు.
ఆరా తీసిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్‌తో మాట్లాడారు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆరా తీశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆ వీడియోను తొలగించండి: కేంద్రం ఆదేశం
మణిపూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇద్దరు మహిళల పట్ల దుండుగులు రాక్షసంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను వెంటనే తొలగించాలని ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది. సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. వీడియోను తొలగించాలంటూ ట్విట్టర్‌ను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దోషులు మరణ శిక్షకు అర్హులని మణిపూర్ సీఎం బీరేన్ పేర్కొన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన దుండుగుల గుంపులో ఉన్న ఒక కీలకమైన వ్యక్తితోపాటు మరొక నిందితుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు చెప్పారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వీడియోను సుమోటోగా దర్యాప్తునకు స్వీకరించారు. గుర్తుతెలియని సాయుధ దుండగులపై బుధవారం థౌబాల్ జిల్లాలోని నాంగ్‌పొక్ సెక్మాయ్ పోలీసు స్టేషన్‌లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడు హెరాదేశ్ సింగ్ ఇంటిని గ్రామస్థులు దహనం చేశారు.
అసలేం జరిగింది?
మణిపూర్‌లోని కాంగ్‌పొక్‌పీ జిల్లాలో మే 3న రెండు తెగల ప్రజల మధ్య హింస జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మే 4న బి.పయనోమ్ గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో దాదాపు 1,000 మందితో కూడిన ఓ గుంపు బి.పయనోమ్ గ్రామంలోకి ప్రవేశించింది. దుండగులు గ్రామంలో ఇళ్లకు నిప్పుపెట్టారు. పశువులు, దుస్తులు, టీవీలు, ఫోన్లు.. ఇలా సర్వం దోచుకున్నారు.
ఈ మూక ఐదుగురు వ్యక్తులపై దాడికి దిగింది. ఆ సమయంలో పోలీసులు సైతం అక్కడే ఉన్నారు. దాడిలో 56 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు మృతిచెందారు. ముష్కరులు అతడి కుమార్తెను(21), మరో మహిళను నగ్నంగా మార్చి, ఊరేగింపుగా పొలాల్లోకి తీసుకెళ్లారు. 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మణిపూర్‌లో మే నుంచి కొనసాగుతున్న ఇంటర్నెట్‌పై నిషే«ధాన్ని తాజాగా ఎత్తివేశారు. అప్పటి సంఘటనకు సంబంధించిన 26 సెకండ్ల వీడియో ఈ నెల 19న సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళలు ప్రస్తుతం చురాచాంద్‌పూర్‌లో శిబిరంలో ఉన్నారు.
మీవల్ల కాకపోతే మేమే రంగంలోకి దిగుతాం: సుప్రీంకోర్టు
మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలకు జరిగిన అవమానాన్ని చూసి తాము తీవ్రంగా కలత చెందామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తనంతట తానుగా గురువారం విచారణకు స్వీకరించింది. ప్రసార మాధ్యమాల్లో కనిపించిన వీడియోను చూస్తే మణిపూర్‌లో రాజ్యాంగ ఉల్లంఘన, మానవ హక్కులకు విఘాతం కలిగినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది.
బాధిత మహిళలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలను అవమానించిన వ్యక్తులను అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని, తగిన చర్యలు ప్రారంభించాల్సి వస్తుందని హెచ్చరించింది. మొత్తం∙చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లో హింసాకాండకు సంబంధించిన ఇతర పెండింగ్ పిటిషన్లపైనా ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment