తూర్పు ఇంఫాల్‌లో శనివారం నిరసన తెలుపుతున్న బాధిత ప్రజలు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటన జరిగిన రోజే అక్కడికి 40కి.మీ. దూరంలో మరో దారుణం జరిగింది. కుకి–జోమి తెగకు చెందిన ఇద్దరు యువతుల్ని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసు స్టేషన్‌లో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్ ద్వారా వెల్లడైంది. బాధిత యువతులు 21, 24 ఏళ్ల వయసున్న వారు.
ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని కొనుంగ్ మమాంగ్ ప్రాంతంలో కార్లు వాష్ చేసేవారు. మే 4న వారు కార్లు కడుగుతూ ఉండగా అల్లరిమూక కొందరు అక్కడికి వచ్చి దౌర్జన్యంగా వారిని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్లారు. వాళ్లు అరవకుండా నోటికి గుడ్డలు కట్టేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్టుగా జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఆ తర్వాత ఆ ఇద్దరు యువతుల్ని దుండగులు పక్కనే ఉన్న రంపం మిల్లులోకి లాగి పడేశారు.
రంపాల మీద పడేయడంతో వారు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆ ఇద్దరు యువతుల్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లడం తాము చూశామని వారి స్నేహితులు చెబుతున్నారు. మరణించిన ఇద్దరు యువతుల్లో ఒకరి తల్లి సాయికుల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాదాపుగా 100–200 మంది దుండగులు రాక్షసంగా తమ కుమార్తె, ఆమె స్నేహితురాల్ని అత్యాచారం చేసి, హింసించి చంపేశారని ఆమె అందులో పేర్కొన్నారు.
వీడియో ఘటనలో మరో నిందితుడు అరెస్ట్
మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటనలో పోలీసులు అయిదో నిందితుడిని అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల వయసున్న యువకుడిని అదుపులోనికి తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ వీడియోలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మణిపూర్‌లో వెలుగులోకి మరో భయానక ఘటన
ఇటీవల మణిపూర్‌లో జరిగిన రెండు వర్గాల ఘర్షణల్లో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను కొందరు దుండగులు సజీవదహనం చేశారు. ఆమెను లాక్కెళ్లి ఇంట్లో తాళం వేసి నిప్పంటించారు. దీనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. కక్చింగ్ జిల్లాలోని సిరోయూ గ్రామంలో మే 28న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment