కొన్ని నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దిగ్బ్రాంతికరమైన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి.
ఫేక్ వీడియో వల్లే
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతి హీనంగా ప్రవర్తించిన మృగాళ్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ప్రధాని, కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తీవ్రంగా స్పందించాయి. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశాయి. అయితే మణిపూర్‌లో ఘర్షణలు మొదలైన మరుసటి రోజే అంటే మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్) ఆరోపించింది. అదే రోజు ఓ బాధిత మహిళ సోదరుడు సైతం అదే మూక చేతిలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఓ ఫేక్ వీడియో వల్ల జరిగినట్లు తేలింది.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..
ఇంఫాల్ లోయలోని మెజార్టీ వర్గమైన మెయితీ తెగ వారు తమను షెడ్యూల్డ్ జాతుల్లో చేర్చాలంటూ చేస్తున్న డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3న కుకీ వర్గం వారు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడంతో మెయితీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఇదే క్రమేనా హింసాత్మకంగా మారి మణిపూర్‌లోని తెగల మధ్య అగ్ని జ్వాలలను రాజేసింది.
పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. దీంతో ఆ మూక తమ ఊరి మీద కూడా దాడి చేస్తుందనే భయంతో మే 4వ తేదిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు(వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు) రక్షణ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఇందులో 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) కాగా.. మరో ఇద్దరు మహిళలు(52, 42) ఉన్నారు.
పోలీసుల నుంచి లాకెళ్లి మరీ..
వీరంతా అడవీలోకి వెళ్తుండగా దారిలో నాంగ్‌పోక్ సెక్‌మై పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు కనిపించడంతో వాళ్ల వద్దకు వెళ్లారు. అంతలోనే స్టేషన్ ఇంకో రెండు కిలోమీటర్లు ఉందనగా.. దాదాపు 800 నుంచి 1000 మందితో ఉన్న ఓ భారీ గుంపు.. గ్రామంలోకి ప్రవేశించి ఈ ఐదుగురి బృందాన్ని అడ్డగించింది. పోలీసుల నుంచి వారిని బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాధిత గ్రూప్‌లోని 19 ఏళ్ల యువకుడు తన సోదరి (21)ని రక్షించేందుకు ప్రయత్నించాడు. కానీ.. సాయుధ మూకల దాడిలో అతడు అక్కడికక్కడే మరణించాడు.
సామూహిక అత్యాచారం
అనంతరం.. 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించడమే కాకుండా సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. సాయం కోసం వాళ్లు కేకలు పెడుతుంటే..కొందరు యువకులు మాత్రం అమ్మాయిల శరీర భాగాలను చేతులతో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే అందులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మే 18నే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును మే 21న ఘటన జరిగిన నోగ్‌పోక్ సెక్‌మై పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. గుర్తుతెలియని దుండగులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన నాంగ్‌పాక్ సెక్‌మై పోలీసు స్టేషన్‌కు మే 21న ఈ కేసును బదిలీ చేశారు.
ఆందుకే ఆలస్యంగా వెలుగులోకి
మణిపూర్‌లో మే 3 నుంచి ఇంటర్నెంట్ బ్యాన్ అయ్యింది. అందుకే మే 4న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటి వరకు బయటకు రాలేదని తెలుస్తోంది. తాజాగా జులై 19న సోషల్ మీడియాలో రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఇద్దరి అరెస్ట్
ఈ ఘోర ఘటనకు సంబంధించి ఇప్పటికే తౌబల్ జిల్లాకు చెందిన హెరాదాస్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వీడియోలో కనిపిస్తోన్న నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 12 బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఇది జరిగి 77 రోజులుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment