
జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ మృతికి నివాళిగా ఢిల్లీలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన యువజనకాంగ్రెస్ కార్యకర్తలు
ట్రైనీ ఎస్సై అనుమానాస్పద మృతి
* మధ్యప్రదేశ్ సీఎంపై దాడిని తీవ్రం చేసిన విపక్షాలు
* పదవి నుంచి వైదొలగాలని డిమాండ్
* వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్
* ఈ కుంభకోణం విచారణకు అంగీకరించిన సుప్రీం
భోపాల్/న్యూఢిల్లీ: ‘వ్యాపమ్’ మరణాలు ఆగడం లేదు. తాజాగా శిక్షణలో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించారు.
వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి 48 గంటల్లో ఇది మూడో మరణం. మధ్యప్రదేశ్ ‘వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగ నియామకాల కుంభకోణం’తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతుండడంపై దేశవ్యాప్తంగా భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ వ్యాపమ్ మరణాల సంఖ్య అధికారికంగానే 26 ఉండగా.. అనధికారికంగా 46కి చేరింది. ఈ భారీ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, లేదంటే అతడిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ స్కామ్‌తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను తొలగించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మరోవైపు, ఈ స్కామ్‌తో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఆరోపించి ప్రజావేగు ఆశిశ్ చతుర్వేది సంచలనం సృష్టించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తదుపరి అనుమానాస్పద మరణం తనదే కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 26 ఏళ్ల ఆశిశ్ ఈ కుంభకోణం బయటపడటానికి ప్రధాన కారకుల్లో ఒకరు. తన ప్రాణానికి కూడా ముప్పుందని మరో ప్రజావేగు ఆనంద్ రాయ్ భయం వ్యక్తం చేశారు.
ట్రైనీ ఎస్సై మృతి.. సాగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న అనామిక సికర్వార్(25).. ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఉన్న చెరువులో సోమవారం శవమై కనిపించింది. స్కామ్‌ను పరిశోధించేందుకు వచ్చిన జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్, స్కామ్‌లో భాగంగా మెడికల్ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన 48 గంటల్లోపే అనామిక మృతి చెందడం గమనార్హం. వ్యాపమ్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆమె ఎస్సైగా ఎంపికయ్యారు.
ఎస్సైగా ఆమె నియామకానికి, స్కామ్‌కు సంబంధం లేదని, ఆమె ఈ ఉద్యోగాన్ని అక్రమంగా సంపాదించలేదని పోలీసులు చెబుతున్నారు. అనామిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నామని సాగర్ ఎస్పీ గౌతమ్ సోలంకీ తెలిపారు. స్కాంకు, ఈ మరణానికి సంబంధం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘వ్యాపమ్ స్కామ్‌తో కానీ, ఆ స్కామ్ దర్యాప్తుతో కానీ అనామిక మృతికి సంబంధం లేదని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నా. ప్రతీ సంఘటననూ వ్యాపమ్‌తో ముడిపెట్టడం సరికాదు’ అన్నారు.
రిజర్వ్‌లో అక్షయ్‌సింగ్ అటాప్సీ నివేదిక
జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతదేహానికి గుజరాత్‌లోని దహోద్ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుల బృందం.. ఆయన మృతికి కారణాలపై తమ అభిప్రాయాలను రిజర్వ్‌లో ఉంచింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆ వైద్యులు మృతికి కారణాలను వెల్లడించలేదని జబువా ఎస్పీ ఆబిద్ ఖాన్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షించేందుకు అక్షయ్‌సింగ్ శరీరాంతర్గత అవయవాలను దహోద్ ఆసుపత్రిలో భద్రపరిచారని ఖాన్ చెప్పారు.
మరోవైపు, జబల్‌పూర్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ మృతికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాధారాలు లభించలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు సభ్యుల వైద్య నిపుణుల బృందం శర్మ మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అక్షయ్‌సింగ్ దేహంపై అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎలాంటి గాయాలు లేవని పోస్ట్‌మార్టంలో తేలిందన్నారు. ఆ జర్నలిస్ట్ గుండె వ్యాకోచించి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ శరీరంపై గొంతు నులిమిన ఆనవాళ్లున్నాయన్న బస్సీ.. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు.
సీఎంగా శివరాజ్ వైదొలగాలి: కాంగ్రెస్
తాజా మరణాలతో సీఎం శివరాజ్‌పై దాడిని కాంగ్రెస్ సోమవారం మరింత తీవ్రం చేసింది. సీఎంగా ఆయన వైదొలగుతేనే ఈ స్కామ్‌లో నిష్పక్షపాత దర్యాప్తు సాధ్యమవుతుందని పేర్కొంది. 45 మరణాల బాధ్యత నుంచి ఆయన తప్పించుకోలేడంది. ఈ స్కామ్ సూత్రధారి ముఖ్యమంత్రేనని ఆరోపించింది. ‘ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం, ఆయన కుటుంబసభ్యులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను తప్పేం చేయలేదని ఆయన భావిస్తే.. తక్షణమే సీబీఐ దర్యాప్తు కోరాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో డిమాండ్ చేశారు.
కుంభకోణంపై ప్రధాని ఇంకా మౌనం పాటించడాన్ని వామపక్షాలు, ఆప్ ప్రశ్నించాయి. వ్యాపమ్ మరణాలను కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్‌గా అభివర్ణించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. అవినీతిని, నేరాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
గవర్నర్ తొలగింపు పిటిషన్‌పై విచారణ
వ్యాపమ్ స్కామ్‌లో హస్తం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను గవర్నర్ పదవి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన ఇతర పిటిషన్లతో పాటు దీనిపై కూడా జులై 9న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ తెలిపింది.
ప్రాణ హాని ఉంది:ఆశిశ్ చతుర్వేది
ఈ స్కామ్‌తో సం బంధమున్న వ్యక్తులు చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నా రని స్కామ్ వెల్లడవడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ఆశిశ్ చతుర్వేది తెలిపారు. ‘సైకిల్‌పై వెళ్తుంటాను. నాకు రక్షణగా ఇచ్చిన పోలీసు మరో సైకిల్‌పై తోడుగా వస్తుంటా డు. ట్రాఫిక్‌లో నేనెక్కడో, తానెక్కడో చిక్కుకుంటాం. దాంతో నాపై దాడి సులభసాధ్యమవుతుంది. నాకు రాష్ట్ర, లేదా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి’ అని కోరారు.
సీబీఐ దర్యాప్తు ఉండదు: రాజ్‌నాథ్
వ్యాపమ్ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. స్కామ్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోందన్నారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. దర్యాప్తు సరిగ్గా సాగడం లేదని హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ భావిస్తే.. సీబీఐ దర్యాప్తునకు అవి ఆదేశాలిస్తాయి. ఆ ఆదేశాలను పాటిస్తాం’ అన్నారు. సీబీఐ దర్యాప్తుకు సంబంధించి దాఖలైన పిల్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయన్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ శవరాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి నరోత్తమ్ మిశ్రా విమర్శించారు. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ కానీ, మరే ఇతర దర్యాప్తు సంస్థను కానీ ఈ స్కాంపై విచారణ జరపాలని ఆదేశించడం కోర్టు పరిధిని అతిక్రమించడమవుతుందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వివరించారు. జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతిపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులతో.. ‘ఈ రోజు నాకన్నా పెద్ద జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా!?’ అని వ్యాఖ్యానించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన కైలాశ్ విజయ్‌వర్గియా వివాదంలో చిక్కుకున్నారు.