
మోదీపై విశ్వసనీయత తగ్గుతోంది
సాక్షి, చెన్నై: దివంగత నేత కే కామరాజ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చిలో గురువారం జరిగిన బహిరంగసభలోకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై దాడిని కొనసాగించారు. ‘అధికారంలో ఉన్నవారు మీ సమస్యలను పట్టించుకోవడం లేదు. మీ మాటలను వినిపించుకోవడం లేదు. మా దగ్గర అధికారం ఉందని, మీ మాటలు వినాల్సిన అవసరం లేదని వారనుకుంటున్నారు.’ అంటూ పరోక్షంగా కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారిపై ధ్వజమెత్తారు. మోదీపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తగ్గుతోందన్నారు.
జోరుగా పడుతున్న వానను సైతం లెక్కచేయకుండా.. తడుస్తూనే రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం. సభకు హాజరైన వారు కూడా అంతే ఉత్సాహంతో రాహుల్ ప్రసంగానికి స్పందించారు. తడుస్తున్న రాహుల్‌కు గొడుగు పట్టడానికి వచ్చిన ఒక నాయకుడిని సున్నితంగా రాహుల్ వారించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన కామరాజ్ గొప్పదనాన్ని రాహుల్ పలుమార్లు ప్రస్తావించారు. ఆయన పాలన నాటి స్వర్ణయుగం కోసం కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నారు.