ఇన్ఫీలో మరో దుమారం! | Whistleblower letter alleges accounting irregularities in Infosys | Sakshi
Sakshi News home page

ఇన్ఫీలో మరో దుమారం!

Published Tue, Oct 22 2019 4:44 AM | Last Updated on Tue, Oct 22 2019 10:56 AM

Whistleblower letter alleges accounting irregularities in Infosys - Sakshi

సలీల్‌ పరేఖ్‌, నీలాంజన్‌ రాయ్‌

బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరోసారి ‘అనైతిక విధానాల’ ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్‌ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌ స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు ఇన్ఫీ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ‘ఇటీవలి కొన్ని త్రైమాసికాలుగా సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తేగోరుచున్నాము. స్వల్పకాలికంగా ఆదాయాలు, లాభాలు పెంచి చూపేందుకు ప్రస్తుత త్రైమాసికంలో కూడా అలాంటి విధానాలే పాటిస్తున్నారు.

బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం‘ అంటూ సెప్టెంబర్‌ 20న డైరెక్టర్స్‌ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ–మెయిల్స్, వాయిస్‌ రికార్డింగ్స్‌ కూడా తమ దగ్గర ఉన్నట్లు తెలిపారు. అందులో తమను తాము ’నైతికత గల ఉద్యోగులుగా’ ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. మరోవైపు,  ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్‌ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.   

అమెరికాలోనూ ఫిర్యాదు..
గడిచిన రెండు త్రైమా సికాలుగా ఇన్ఫీ ఖాతాలు, ఆర్థిక ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ అమెరికాలోని ‘విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’కు కూడా ప్రజావేగులు ఫిర్యాదు చేశారు. లాభాలను పెంచి చూపడం కోసం వీసా ఖర్చుల్లాంటి వ్యయాలను పూర్తిగా చూపించొద్దంటూ తమకు ఆదేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘ఈ సంభాషణకు సంబంధించిన వాయిస్‌ రికార్డింగ్స్‌ మా దగ్గర ఉన్నాయి. ఆడిటరు వ్యతిరేకించడంతో దీన్ని వాయిదా వేశారు‘ అని తెలిపారు. ఈ క్వార్టర్‌లోనూ లాభాలు తగ్గిపోయి, స్టాక్‌ ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఓ కాంట్రాక్టుకు సంబంధించి 50 మిలియన్‌ డాలర్ల చెల్లింపులను ఖాతాల్లో చూపొద్దంటూ చాలా ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. కీలకమైన సమాచారాన్ని ఆడిటర్లు, బోర్డుకు తెలియకుండా తొక్కిపెట్టి ఉంచడం జరుగుతోందని తెలిపారు.   

సీఈవోనే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు..
‘భారీ డీల్స్‌ కుదుర్చుకోవడంలో బోలెడు అవకతవకలు జరుగుతున్నాయి. సీఈవో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. భారీ మార్జిన్లు వస్తున్నాయని తప్పుదోవ పట్టించేలా నివేదికలు తయారు చేయాలంటూ సేల్స్‌ టీమ్‌ను ఆదేశిస్తున్నారు. సీఎఫ్‌వో కూడా ఆయన చెప్పినట్లే చేస్తున్నారు. భారీ డీల్స్‌లో లొసుగులు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు తేనివ్వకుండా మమ్మల్ని ఆపేస్తున్నారు. బోర్డు సభ్యులకివేవీ పట్టవని.. షేరు ధర బాగుంటే వాళ్లకు సరిపోతుందని సీఈవో మాతో చెప్పారు‘ అని ఫిర్యాదుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు.

గత కొన్ని త్రైమాసికాలుగా కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల డీల్స్‌లో పైసా మార్జిన్‌ లేదని పేర్కొన్నారు. చాలా మటుకు స మాచారాన్ని ఆడిటర్లకు చెప్పకుండా దాచిపెట్టేస్తు న్నారని, కేవలం లాభాలు, సానుకూల అంశాలే ఆర్థిక ఫలితాల్లో చూపాలని సీఈవో, సీఎఫ్‌వో ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించా రు. దీన్ని వ్యతిరేకించే ఉద్యోగులను పక్కన పెడుతున్నారని, ఫలితంగా వారిలో చాలా మంది సం స్థ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని తెలిపారు.

గతంలో కూడా ఇన్ఫీ.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ టెక్నాలజీ సంస్థ పనయా కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ప్రజావేగుల ఆరోపణలు వచ్చిన దరిమిలా అప్పటి సీఈవో విశాల్‌ సిక్కా, ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తదితర వ్యవస్థాపకుల మధ్య వివాదం తలెత్తింది. చివరికి 2017 ఆగస్టులో సిక్కా వైదొలిగారు. ఆయన స్థానంలో గతేడాది జనవరిలో పగ్గాలు చేపట్టిన సలిల్‌ పరేఖ్‌ కూడా తాజాగా గవర్నెన్స్‌ లోపాల ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం.

ఇన్ఫీ ఏడీఆర్‌ క్రాష్‌...
తాజా పరిణామాలతో అమెరికా నాస్‌డాక్‌లో లిస్టయిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ (అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్‌) సోమవారం కుప్పకూలింది. ఒక దశలో ఏకంగా 16 శాతం క్షీణించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement