మాజీ మహిళా ఉద్యోగి దెబ్బ, కదులుతున్న లక్షల కోట్ల విలువైన కంపెనీ పునాదులు? | 30 US States Have Filed Lawsuits Against Meta Platforms For Harming Childrens Mental Health - Sakshi
Sakshi News home page

ఒక్క వీడియోతో కదులుతున్న పునాదులు?..'టీ కప్పులో తుఫాను'కాదు మెటాను ముంచే విధ్వంసం?

Published Wed, Oct 25 2023 12:32 PM | Last Updated on Fri, Oct 27 2023 7:21 AM

Us States Have Filed Lawsuits Against Meta Platforms - Sakshi

ఒక్క మహిళా ఉద్యోగి. 8.48 నిమిషాల నిడివి గల వీడియో. వందల కొద్దీ డాక్యుమెంట్లు.వెరసీ ప్రపంచంలో అత్యంత విలువైన సోషల్‌ మీడియా కంపెనీ మెటా పునాదులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయా? 2021లో మెటా (అప్పడు ఫేస్‌బుక్‌)లోని అక్రమాల్ని బయటపెట్టింది తానేనంటూ వెలుగులోకి వచ్చిన ఓ వీడియోతో గంటల వ్యవధిలో ఆ సంస్థ రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రారంభంలో మహిళ చేసిన ఆరోపణల్ని సీఈవో జూకర్‌ బెర్గ్‌ సైతం ఇదంతా 'టీ కప్పులో తుఫాను' అని అనుకున్నారు. కానీ మెటాను ముంచే విధ్వంసానికి దారితీస్తుందనుకోలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాజాగా, ఆ వీడియో తాలుకు ప్రభావం మరోసారి మెటాపై పడింది. 

మెటా, ఆ సంస్థకు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ షాక్‌ తగిలింది. 41 రాష్ట్రాలకు చెందిన పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు యువతను వ్యసనపరులుగా మార్చడం ద్వారా వారిలో మానసిక రుగ్మతలు పెరిగేలా ఆజ్యం పోస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 

ఫిర్యాదుల వెల్లువ
మెటా, ఇన్‌స్టాగ్రామ్‌పై ఓక్లాండ్‌, కాలిఫోర్నియా, ఫెడరల్‌ కోర్టులో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కాలిఫోర్నియా, న్యూయార్క్‌తో పాటు మరో 33 రాష్ట్రాల పిటిషనర్లు.. ఈ రెండు ఫ్లాట్‌ఫామ్‌లు తప్పుడు ప్రచారాలు చేస్తూ పదే పదే తప్పుదారి పట్టిస్తున్నాయని.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రలోభపెట్టి.. ఆన్‌లైన్‌లో గంటల కొద్ది గడిపేలా శక్తివంతమైన టెక్నాలజీని మెటా ఉపయోగించుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఆదాయాన్ని గడించి లాభపడుతుందని అన్నారు.   

యూజర్ల కన్నా.. డబ్బులే ముఖ్యం
ఓ వైపు అడ్వటైజర్లు చేజారిపోకుండా యువతను కట్టిపడేయడంలో మెటా వ్యూహాత్మకంగా ఎలా వ్యాపారం చేస్తుందో వారు వివరించారు. ముఖ్యంగా, పలు అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చిన్న వయస్సు వారినే తమ వ్యాపారానికి అనువుగా మార్చుకుంటున్నాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు తమ సంస్థ బ్రాండ్‌లను వినియోగించుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ తరహా వ్యాపార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వారికి లాభం చేకూరేలా మెటా,ఇన్‌స్టాగ్రామ్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి’ అని  కోర్టు దావాలో తెలిపారు.

పిల్లల్ని నాశనం చేస్తున్నాయ్‌
అంతేకాదు, ‘నిరాశ, ఆందోళన, నిద్రలేమి, విద్య, రోజువారీ జీవితంలో జోక్యం, అనేక ఇతర ప్రతికూల ఫలితాలు పిల్లల జీవితాల్ని నాశనం చేస్తున్నాయని పిటిషన్లు కోర్టు మెట్లెక్కారు. దీంతో మెటాపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వివిధ రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించినందుకు మెటా 1,000 వెయ్యి నుంచి 50,000 డాలర్ల వరకు సివిల్ పెనాల్టీలను ఎదుర్కొంటుంది. కేసు తీవ్రతను బట్టి భారీ మొత్తంలో మెటా చెల్లించాల్సి ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించే మిలియన్ల మంది పిల్లలు, యవకులకు చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ దెబ్బే 
ఇలా మెటా వరుస ఇబ్బందులు ఎదుర్కొవటానికి ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ కారణం. ఆమె గతంలో ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా పని చేశారు. 2021లో ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ మెటా తీరును తప్పుబట్టారు. ప్రజల భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ముఖ్యమని..ద్వేషాన్నిరెచ్చగొట్టే తప్పుడు సమాచారాన్ని ఎంతగా వ్యాప్తి చెందిస్తున్నదీ కంపెనీ సొంత పరిశోధన కూడా చెబుతోందంటూ కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు. 

ఇద్దరు టీనేజర్ల అభిప్రాయాలు  
ఆ డాక్యుమెంట్లలో వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోల్లో ఇద్దరు టీనేజర్లు మెటాకి చెందిన సోషల్‌ సైట్లపై తమ అభిప్రాయాల్ని వివరించారు. ‘‘14ఏళ్ల ఎలీనార్‌, ఫ్రేయా’లు ఇద్దరూ తమ వయస్సు వారిలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. ఓ టీనేజర్‌గా మేం ఇందులో మోడల్స్‌ను ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ను చూస్తుంటాం. వాళ్లందరూ స్కిన్నీగా పర్‌ఫెక్ట్‌ బాడీతో ఉంటారు. వాళ్లని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. 

‘‘మనసుకు ఏదీ తోచనప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్‌ చేసేవే మనకి కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్స‌ర్స్‌ను సెలబ్రిటీస్‌ మనకి కనిపిస్తుంటారు. అప్పుడనప్పిస్తుంది.  ఓహ్‌! ‘అలా మనం ఎప్పటికీ అవ్వలేమని’ ఫ్రేయా అన్నారు. ఎలీనార్‌, ఫ్రేయాల ఆందోళనని షేర్‌ చేసింది.మానసిక ఆరోగ్య సమస్యలపై బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్‌ స్టాగ్రామ్‌ మరింత దారుణంగా చేస్తుందని లీకైన ఫేస్‌బుక్‌ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ డాక్యుమెంట్స్‌ను ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ లీక్‌ చేసింది. 

లీకైన కొద్ది సేపటికే రూ.50 వేల కోట్లు నష్టం
ఇలా లీకైన కొద్ది సేపటికే సోషల్‌ మీడియాలో అంతరాయం ఏర్పడడంతో ఫేస్‌బుక్‌కు 7 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో రూ.50 వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. ఈ ప్రభావం ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజీ జరగడం ఇదే మొదటి సారి. అంతేకాదు ఈ అంతరాయంతో అపరకుబేరుల జాబితా నుంచి  మార్క్‌ జూకర్‌ బర్గ్‌ స్థానం కిందకి దిగజారింది. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.

కోలుకోలేని నష్టం
నాటి నుంచి మెటా ఊహించని విధంగా నష్టపోతూ వస్తుంది. లీకైన పత్రాల వల్ల కొన్ని గంటల వ్యవధిలో వేల కోట్ల నష్టంతో పాటు, సంస్థ పేరును మార్చడంతో పాటు అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. అయితే తాజాగా, 41 రాష్ట్రాల్లో మెటాపై దాఖలైన వాజ్యం ఆ సంస్థ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కొనుందో చూడాల్సి ఉంది.  

చదవండి👉సంచలన నిర్ణయం.. భారత్‌కు గుడ్‌బై చెప్పిన రెండు దిగ్గజ కంపెనీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement