
పాస్‌పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్‌పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
నిబంధనల్లో కీలక మార్పులు
2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.

2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టినవారికి..
2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింది డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆమోదిస్తారు.
- జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం.
- దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్.
- దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు.
- దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్ ఎక్స్‌ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు (ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి). వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి అధికారి ధ్రువీకరణ ఉండాలి.
- దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్.
- దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడీ కార్డు.
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్. ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది.
దరఖాస్తుదారులపై ప్రభావం
కొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తరువాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్‌పోర్ట్ దరఖాస్తులకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రామాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డులలో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించినవారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్‌పోర్ట్ కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌లను సమర్పించవచ్చు.