మా సీఈవో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.. ఆందోళన చెందుతున్న కంపెనీ | Meta says Mark Zuckerberg may die because he does high risk activities | Sakshi
Sakshi News home page

మా సీఈవో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు.. ఏమైనా జరిగితే కంపెనీ భవిష్యత్తు ఏంటి?

Published Sat, Feb 3 2024 5:24 PM | Last Updated on Sat, Feb 3 2024 5:59 PM

Meta says Mark Zuckerberg may die because he does high risk activities - Sakshi

నేటి ఆధునిక ప్రపంచంలో టెక్ దిగ్గజాల ప్రతి కదలికను మార్కెట్లు నిశితంగా గమనిస్తుంటాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మెటా.. తమ సీఈవో గురించి తెగ ఆందోళన పడిపోతోంది. హై రిస్క్‌ పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడని, దీని ప్రభావం కంపెనీ భవిష్యత్తుపై పడుతుందని బెంగపడుతోంది.

మెటా తమ తాజా ఆర్థిక నివేదికలో కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు పొంచిఉన్న ముప్పును వెల్లడించింది. జుకర్‌బర్గ్ అలవాట్లు, జీవనశైలితో మెటా స్పష్టంగా సంతోషంగా లేన్నట్లు కనిపిస్తోంది.  మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ , హానికరమైన క్రీడలతో జుకర్‌బర్గ్ థ్రిల్ కోరుకుంటున్నారని, ఇది కేవలం ఆయన వ్యక్తిగతంగానే కాకుండా కంపెనీకి, అందులో పెట్టుబడివారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

"జుకర్‌బర్గ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌లోని కొంతమంది తీవ్రమైన గాయాలు, ప్రాణాల మీదకు  తెచ్చే క్రీడలు, ఇతర హై రిస్క్‌ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.  జుకర్‌బర్గ్ ఏ కారణం చేతనైనా అందుబాటులో లేకుంటే మా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు" అని మెటా తన వార్షిక నివేదికలో పేర్కొంది.

మస్క్‌తో కేజ్‌ ఫైట్‌
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర హానికరమైన క్రీడల పట్ల జుకర్‌బర్గ్‌కు ఉన్న మక్కువ తెలిసిందే. గత నవంబర్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో మోకాలికి గాయం కావడంతో ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కేజ్‌ ఫైట్‌కి సిద్ధమైనప్పుడు జుకర్‌బర్గ్‌ సాహసాలు మరోసారి ముఖ్యాంశాలుగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై గొడవలకు పేరుగాంచిన ఇద్దరు బిలియనీర్లు తమ విభేదాలను పరిష్కరించడానికి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ మ్యాచ్‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఒకరినొకరు వెనక్కు తగ్గినట్లు ఆరోపణలు చేయడంతో ఆ ఫైట్‌ రద్దయింది.

"హై రిస్క్‌ = హై రివార్డ్‌"
ఈ కొత్త రిస్క్‌ల గురించి చర్చలకు ప్రతిస్పందనగా, జుకర్‌బర్గ్ "హై రిస్క్‌ = హై రివార్డ్‌" అనే సందేశంతో థ్రెడ్స్‌లో జిఫ్‌ పోస్ట్ చేశారు. జుకర్‌బర్గ్ డేర్‌డెవిల్ సాహసాలతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, మెటా శుక్రవారం తన షేర్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ నాల్గవ త్రైమాసిక లాభాలలో మూడు రెట్లు పెరిగినట్లు నివేదించింది. దానితో పాటు దాని మొట్టమొదటి డివిడెండ్ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement