న్యూఢిల్లీ: స్థూలఆర్థిక వృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో భారత్‌లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇండియా హెడ్ సంధ్య దేవనాథన్ చెప్పారు. వీటితో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి తమ యాప్స్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌ను తాము కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నామని ఆమె వివరించారు.
కేంద్రం కొత్తగా రూపొందించిన డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టంతో ఇటు యూజర్ల వివరాల గోప్యతను పాటించడం, అటు నూతన ఆవిష్కరణలు చేయడం మధ్య సమతౌల్యం పాటించడానికి సంబంధించి టెక్ కంపెనీలకు స్పష్టత లభించిందని సంధ్య తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత కంటెంట్‌ని క్రియాశీలకంగా కట్టడి చేసేందుకు కృత్రిమ మేధను తాము సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.
పెరుగుతున్న యూజర్లు..
కీలక మార్కెట్లలో టీనేజర్లు, యువతలో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయం సరికాదని.. మెటాలో భాగమైన ఫేస్‌బుక్‌కు భారత్‌లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని వివరించారు. భారత్‌లో తాము వివిధ నవకల్పనలను పరీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 2030 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదగాలన్న భారత్ విజన్ అనేది వ్యాపారాలకు గణనీయంగా ఊతమివ్వగలదని సంధ్య చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment