‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’ | OpenAI Denies Any Agreement With Elon Musk | Sakshi
Sakshi News home page

‘విజయం తనకే దక్కాలనే ఉద్దేశంతో కట్టుకథలు’

Published Tue, Mar 12 2024 11:04 AM | Last Updated on Tue, Mar 12 2024 1:16 PM

OpenAI Denies Any Agreement With Elon Musk - Sakshi

చాట్‌జీపీటీని రూపొందించిన సంస్థ ఓపెన్‌ఏఐ, దాని సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌పై టెస్లా అధినేత ఎలోన్‌మస్క్‌ ఇటీవల దావా వేసిన సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ రూపొందించే సమయంలో కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎలోన్‌మస్క్‌ చెప్పారు. ఈ పరిణామాల వల్ల ఓపెన్‌ఏఐ, ఎలాన్‌ మస్క్‌ మధ్య వివాదం క్రమంగా ముదురింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సంస్థ స్పందించింది. 

ఎలోన్ మస్క్ ఓపెన్‌ఏఐపై చేసిన అన్ని వ్యాఖ్యలు కట్టుకథని కొట్టిపారేసింది. మస్క్‌తో ఓపెన్‌ఏఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. సంస్థకు చెందిన అన్ని విజయాలు తనకే దక్కాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నట్లు వివరించింది. ఆయన లేకుండా విజయం సాధించడాన్ని మస్క్‌ తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొంది.

ఓపెన్‌ఏఐని ప్రజా సంక్షేమం కోసం లాభాలను ఆశించకూడదనే భావనతో ఏర్పాటు చేశామని మస్క్‌ ఇటీవల తెలిపారు. కానీ, ఆ కంపెనీ ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్‌ కింద పూర్తిగా లాభాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. దీంతో తన లక్ష్యం విషయంలో రాజీ పడిందని, ఒప్పందాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ శాన్‌ఫ్రాన్సిస్కో సుపీరియర్‌ కోర్టులో దావా వేశారు.

ఈ వ్యవహారంపై ఓపెన్‌ఏఐ గతంలో మాట్లాడుతూ తమ కంపెనీని టెస్లాలో విలీనం చేయాలని మస్క్‌ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించింది. లేదంటే పూర్తి నియంత్రణను ఆయన చేతికి ఇవ్వమన్నారని పేర్కొంది. 2017లో లాభాపేక్ష సంస్థనే ఏర్పాటు చేయాలనుకున్నామని.. కానీ, బోర్డు నియంత్రణ, సీఈఓ పదవి తనకు కావాలని మస్క్‌ డిమాండ్‌ చేసినట్లు చెప్పింది. కానీ, తమ కంపెనీ వీటికి అంగీకరించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ నుంచి వైదొలగారని చెప్పింది. వీటికి సంబంధించిన కొన్ని ఈమెయిళ్లను కంపెనీ ఇటీవలే బహిర్గతం చేసింది.

ఇదీ చదవండి: ఇండియాలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ

2022 నవంబరులో వచ్చిన చాట్‌జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2015లో ఓపెన్‌ఏఐను శామ్‌ ఆల్టమన్‌ బృందం స్థాపించినప్పుడు మస్క్ అందులో పెట్టుబడులు పెట్టారు. 2018లో సంస్థ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. 2022 అక్టోబరులో 44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్‌)ను కొనుగోలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement