Shore
-
మంచి మాట..: ఈ దరి... ఆ దరి
జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి. సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది. మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే. ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు. ఇదే కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు! శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు. శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు. కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ తట్టినా చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..! ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు. చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి. జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు. జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది. మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
మంత్రికి సంతాపం.. కొన్ని గంటలకే చిరంజీవిగా అదే మంత్రి!!
మడగాస్కర్: హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మడగాస్కర్ దేశ మంత్రి సెర్జ్ గెలె ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన సాహసంతో సుమారు 12గంటల పాటు పోరాడి సముద్రంలో ఈదుకుంటూ బయటపడ్డారు. తాను మరణించలేదని బతికే ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం ఐలాండ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ మునక ప్రమాదంలో 39మంది చనిపోయిట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో పడవ మునిగిపోవడంతో ఆ ప్రదేశాన్ని పరిశీలించడానికి మంత్రి బృందం అక్కడికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న మంత్రితో పాటు మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పట్ల దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రితో పాటు మిగతా ఇద్దరు అధికారులు మరణించారని ఆయన నివాళులు అర్పించారు. అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతమైన మహాంబోకు చేరుకున్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తర్వాత తాను రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు సముద్రంలో ఈదుకుంటూ వచ్చినట్లు మంత్రి గెలె తెలిపారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా బతికే ఉన్నానని మహాంబో గ్రామస్తులకు చెప్పారు. ఆయన హెలికాప్టర్‌లోని ఒక సీటును సుముద్రం నీటిపై తేలడానికి ఉపయోగించుకున్నారని పోలీస్ చీఫ్ జఫిసంబత్రా రావోవీ పేర్కొన్నారు. ఆయన క్రీడల్లో ఎల్లప్పుడూ గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించేవారని, 30 ఏళ్ల వ్యక్తిలా బతకడానికి పోరాడారని రావోవీ ప్రశంసించారు. -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
7న పీఎస్ఎల్వీ సీ36 నింగిలోకి
6వ తేదీ తెల్లవారుజాము నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 7న ఉదయం 10.24కు పీఎస్ఎల్వీ సీ36 రాకెట్‌ను ప్రయోగిం చేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆరో తేదీ తెల్లవారు జామున 3.24కు ప్రారంభమవుతుంది. రాకెట్‌కు శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేసి ఆదివారం ఉదయం ఎంఎస్టీ రిహార్సల్ నిర్వహించ నున్నారు. ఆదివారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ వారు మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు. షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ36 రాకెట్ ద్వారా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 1235 కిలోల బరువు గల రిసోర్స్‌శాట్ 2ఏ ఉపగ్రహాన్ని వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగిస్తున్నారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ36 ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 38వ రాకెట్. 1994 నుంచి 2016 దాకా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 121 ఉపగ్రహాలను రోదసిలోకి పంపారు. -
అంతా గోప్యమే..
► అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా అంతరిక్ష కేంద్రం ► బయటకు పొక్కనీయకుండా అధికారుల జాగ్రత్తలు ► ఇదే అదునుగా రెచ్చిపోతున్న కొందరు ► షార్ ప్రతిష్టకే మచ్చ తెస్తున్న ఘటనలు శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. తరచుగా చోటు చేసుకుంటున్న ఏదో ఒక ఘటనతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శ్రీహరిపేట పేరుప్రతిష్టలు చిన్నబోతున్నాయి. ఇలాంటి ఘటనల మీద ఘాటుగా స్పందించాల్సిన పరిపాలనా యంత్రాంగం బయటకు పొక్కనీయకుండా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ భయం లేకుండా పోతోంది. ఇక్కడ జరుగుతున్న అనేక ఘటనలను విచారణ పేరుతో అధికారులే గోప్యంగా వుంచుతున్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం లో విద్యార్థినులతో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం అలవాటైపోయింది. గతంలో ఈ స్కూ ల్లో ఇదే తరహాలోనే ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పట్లో జరిగిన ఘటనలను తేలికగా తీసుకుని ఇంక్రిమెంట్ కటింగ్‌తో సరిపెట్టడంతో వేధింపులు, వెకిలిచేష్టలు పునరావృతమవుతున్నాయి. వారితో ఎదురవుతున్న బా ధలను ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు లోలోపల కుమిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉపాధ్యాయుల చేష్టలు పరాకాష్టకు చేరడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద గొల్లుమన్నారు. వారు ఈ ఘటనలపై రెండు రోజుల క్రితం షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన లలితకుమారితో మహిళా వేధింపుల నిరోధక కమిటీ వేసి నివేదిక కోరారు. ఆమె నేతృత్వం లో జరిగిన విచారణలో ఉపాధ్యాయులు దార్భజీ, కృష్ణప్రసాద్, షణ్ముగనాథన్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు సుధీర్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. విచారణ నివేదికను ఆమె గురువారం షార్ కంట్రోలర్‌కు సమర్పించగా నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి పక్కన పెట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని కంట్రోలర్ రాజారెడ్డి తెలిపారు. కఠినమైన చర్యలు లేకనే గతంలోనూ షార్‌లో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ప్రాజెక్ట్‌లు చేయడం కోసం వచ్చే ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థినులతోనూ అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలున్నా యి. అయితే ఘటనకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ యథాప్రకారం చెలరేగిపోతున్నారు. తప్పు చేసిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే మరొకరు అదే తప్పు చేసేందుకు వెనకడుగు వేస్తారని షార్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రిన్సిపల్‌కు మెమో అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్‌కు శుక్రవారం షార్ పరిపాలనా విభాగం అధికారులు మెమో ఇచ్చినట్లు సమాచారం. స్కూలులో విద్యార్థినులపై వేధింపులు జరుగుతుంటే ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడాన్ని క్రమశిక్షణరాహిత్యంగా భావించినట్లు తెలిసింది. -
యువకుడు అనుమానాస్పద మృతి
ఈతముక్కల (కొత్తపట్నం): సముద్రపు ఒడ్డున అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఈతముక్కలలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు టైలర్ కాలనీకి చెందిన షేక్ అమీద్ (22) అల్యూమినియం, రాడ్ బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అమీద్‌తో పాటు మహ్మద్ సుల్తాన్, మహ్మద్ ఫక్రు, సయ్యద్ రసూల్, మరో వ్యక్తి 20 రోజులుగా స్థానికంగా నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ హేచరీలో పనిచేసేందుకు వచ్చారు. హేచరీ సముద్రానికి దగ్గరలో ఉన్నందున గురువారం రాత్రి సముద్రపు ఒడ్డున ఉన్న పడవ మీద కూర్చొని మద్యం తాగారు. రాత్రి హేచరీ దగ్గరకు వచ్చి నిద్రించారు. శుక్రవారం ఉదయం అమీద్ పక్కన లేకపోవడంతో మిగిలిన వారు అంతా వెతికారు. చివరకు సముద్రం ఒడ్డున మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై బి.నరసింహారావు మృతదేహానికి పంచనామా చేసి రిమ్స్‌కు తరలించారు. యువకుని మృతిపై అనుమానాలు అమీద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదుగురిలో సయ్యద్ రసూల్ అనే వ్యక్తి గురువారం రాత్రే నెల్లూరు వెళ్లడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ఎక్కడ గుర్తిస్తే అక్కడే పంచనామా చేస్తారు. అయితే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లేందుకు ఈతముక్కల పల్లెపాలెం రోడ్డుకు తీసుకురావడంపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.