7న పీఎస్‌ఎల్‌వీ సీ36 నింగిలోకి
6వ తేదీ తెల్లవారుజాము నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 7న ఉదయం 10.24కు పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్‌ను ప్రయోగిం చేందుకు ఇస్రో సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆరో తేదీ తెల్లవారు జామున 3.24కు ప్రారంభమవుతుంది. రాకెట్‌కు శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేసి ఆదివారం ఉదయం ఎంఎస్‌టీ రిహార్సల్ నిర్వహించ నున్నారు. ఆదివారం సాయంత్రం ఎంఆర్‌ఆర్ కమిటీ వారు మిషన్ సంసిద్ధతా సమావేశాన్ని నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు.
షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ36 రాకెట్ ద్వారా అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 1235 కిలోల బరువు గల రిసోర్స్‌శాట్ 2ఏ ఉపగ్రహాన్ని వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగిస్తున్నారు. 44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ36 ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఇది 38వ రాకెట్. 1994 నుంచి 2016 దాకా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 121 ఉపగ్రహాలను రోదసిలోకి పంపారు.