సాక్షిప్రతినిధి, కాకినాడ: అమెరికన్ తల్లి రొయ్యకు మన ఆక్వా రైతులు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. తల్లి రొయ్యలను దేశీయంగా మన హేచరీల్లో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని హేచరీల్లో రొయ్య పిల్లల పునరుత్పత్తి కోసం తల్లి రొయ్యలను కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన హేచరీల్లో బ్లాక్ టైగర్(మోనాడామ్) తల్లి రొయ్యలు 2009కి ముందు భారతీయ సముద్ర జలాల్లో లభించేవి. ఆ తర్వాత బ్లాక్‌టైగర్ 60 శాతం బాక్టీరియాతో రోగాల బారిన పడి తల్లి రొయ్యలు దెబ్బతిన్నాయి.
అనంతరం రోగాల్లేని తల్లి రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి వెనామీ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే లభించే ఈ వెనామీ(ఎగ్జోటిక్ స్పీసిస్)వైట్‌లెగ్ ష్రింప్‌ను దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. అమెరికాలో వెనామీని పునరుత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఎంపిక చేసిన 14 కంపెనీల నుంచి తల్లి రొయ్య దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది.
ఇలా దిగుమతి చేసుకునే వెనామీని చెన్నైలోని సెంట్రల్ క్వారంటైన్‌లో ఐదు రోజులు అన్ని పరీక్షల అనంతరం ఒడిశా, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. మన రాష్ట్రంలోని హేచరీల్లో వినియోగిస్తున్నారు. వెనామీ తల్లి రొయ్య ప్రస్తుతం అమెరికాలో 80 డాలర్లు (రూ.6,400) పలుకుతోంది. కస్టమ్స్, లాజిస్టిక్, ఫ్లైట్ చార్జీలు 30 శాతం అదనంగా కలుపుకొంటే సుమారు రూ.10,000 వరకు అవుతుంది.
ఇక్కడి హేచరీలు అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి ఏటా 2లక్షల నుంచి 2.50 లక్షల తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా తీరంలో 550 హేచరీలుంటే అత్యధికంగా మూడొంతులు హేచరీలు కాకినాడ తీరంలోనే ఉండటం విశేషం.
మరో రెండేళ్ల సమయం..
కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీకి కేంద్రం తీసుకొచ్చి న సవరణలు వెనామీ తల్లి రొయ్యల స్థానే.. దేశీయంగా తల్లి రొయ్యల ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దశలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లు, మలి దశలో న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్(ఎన్‌బీఎస్)లు నెలకొల్పుకోవచ్చు. ఈ రెండు దశలు పూర్తయ్యేసరికి తల్లి రొయ్య కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఈ రెండు దశలు చేరుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా. తొలి దశలో భాగంగా బీఎంసీ ద్వారా తల్లి రొయ్య స్థానంలో పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుంటారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లలో పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఒక తల్లి రొయ్య స్థానంలో అంతే ఖర్చుతో 1000 పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేయొచ్చు. ఇలా పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుని బీఎంసీలలో పునరుత్పత్తి చేస్తారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే మన రాష్ట్రంలో నిర్వహించేందుకు వీలుగా పలు సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెల్లూరు బీఎంఆర్, భీమవరం ఆమందా, శ్రీకాకుళం కోనాబే, విశాఖలో ఎమ్‌పెడా బీఎంసీ(బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్)లు సిద్ధమయ్యాయి. మలి దశలో ఇక అమెరికా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా మనమే నేరుగా తల్లి రొయ్యను పునరుత్పత్తి చేయొచ్చు.
ఇందుకోసం న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే నిర్వహిస్తున్న సెంటినల్ ట్రైల్స్ ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్‌బీసీలలో నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకనుగుణంగా జెనెటిక్ బ్రీడింగ్, జెనెటిక్ ప్రాసెసింగ్ చేస్తారు.
ఇక లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు..
బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా మన తల్లి రొయ్యను మనమే పునరుత్పత్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు.
– హరినారాయణరావు, ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ష్రింప్‌హేచరీస్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment