సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు.
30 పైసలకే వనామీ సీడ్ సరఫరా
నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు.
బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment