నాటు కోళ్ల హేచరీ! | Short cost of planting chicken children | Sakshi
Sakshi News home page

నాటు కోళ్ల హేచరీ!

Published Tue, Mar 20 2018 4:32 AM | Last Updated on Tue, Mar 20 2018 4:32 AM

Short cost of planting chicken children - Sakshi

నాటు కోళ్ళ షెడ్డులో నవత, అరుణ్‌ క్రాంతి కుటుంబం

మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్‌ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతేకాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు.

వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్‌ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్‌ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్‌ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్‌ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతోపాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు.  

800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5–10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు.

ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా..
ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్‌ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్‌వీడ్‌తోపాటు మినరల్స్‌ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం.

గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ
నాటు కోడి పిల్లలకు డిమాండ్‌ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3–4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్‌ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్‌ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్‌ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్‌ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5–10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు.

80 రోజుల్లో కిలో–కిలోన్నర బరువు
నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్‌లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్‌ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్‌ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు.

ఓటమే రేపటి విజయానికి నాంది!
ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది.
– నవత, అరుణ్‌ క్రాంతి (90005 67121), జగిత్యాల
 


                                          కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు


                                      విద్యుత్‌ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు


                                         ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి


                                  మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు

– పన్నాల కమలాకర్‌ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement