కోళ్లరైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు హ్యాచరీల దందాకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. బ్రాయిలర్ కోళ్ల రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ క్షేత్రస్థాయిలో పలు అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు, నిబంధనలను అమలు చేసే యోచనలో ఉంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కదలిక వచ్చింది. ఫలితంగా జిల్లాలో కోడిపిల్లలను పెంచే రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.
సాక్షి, పలమనేరు(చిత్తూరు): జిల్లాలో బ్రాయిలర్ కోడిపిల్లల ధరలను హ్యాచరీస్ వారు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారు. కోళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణకు కంపెనీలు పంపిణీ చేసే మందుల ధరలను వారే నిర్ణయిస్తున్నారు.కోళ్లదాణా విషయంలో నాణ్యతలేని దాణాను కంపెనీలు రైతులకు అందిస్తున్నాయి. బ్రాయిలర్ కోడిపిల్లలకు వేసే టీకాలైన లసోట, వీబీడీ, జెంటామైసిన్‌లను ప్రైవేటువారు నిపుణుల చేత వేయించడం లేదు. వాటిని రైతులకిచ్చి వెళుతుండడంతో.. అనుభవం లేని రైతులు టీకాలు సక్రమంగా వేయక కోడిపిల్లలకు వ్యాధుల బాధ తప్పడంలేదు. హ్యాచరీలు రైతులకు సరఫరా చేసే కోడిపిల్లల్లో కొంతశాతం బలహీనమైన వాటిని ఇచ్చేస్తున్నారు.
నాణ్యత లేమితో నష్టపోతున్న రైతులు..
సాధారణంగా నాణ్యమైన కోడిపిల్ల 40 గ్రాముల బరువు ఉండాలి. అయితే కంపెనీ అందించే కోడిపిల్లల్లో 30శాతం పిల్లల బరువు 30 నుంచి 35 గ్రాములుగానే ఉంటోది. దీంతో కోళ్లపెంపకం రైతులకు నష్టం తప్పడం లేదు. ఫలితంగా కోళ్ల మరణాల శాతం పెరిగి ఎఫ్‌సీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) పెరగడంతో రైతులకు కంపెనీలు చెల్లించే ధరలు తగ్గుతున్నాయి. 40 నుంచి 50 రోజుల పాటు రైతు కోడిపిల్లలను పెంచినందుకు కిలోకు రూ 5కు పైగా అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కిలోకు రూ.4 కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వానికి నివేదిక ఇలా..
జిల్లాలోని కోళ్ల రైతుల సమస్యలపై బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెటర్నరీ డైరెక్టర్ సోమశేఖర్ చిత్తూరు పశుసంతతి పరిశీలన పథక సహాయసంచాలకులు డా.షేక్ అసీఫ్‌తో ఏకసభ్య కమిటీని నియమించారు. ఆయన జిల్లాలోని బ్రాయిలర్ కోడిపిల్లల పెంపకదారులైన రైతుల బాధలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రైవేటు హ్యాచరీల వ్యవహారాలను గమనించి నివేదికను పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి రెండ్రోజుల క్రితం సమర్పించారు. వారు ప్రభుత్వానికి ఈ నివేదికను పంపారు.
సమస్యలకు పరిష్కారం ఇలా...
- ప్రైవేటు హ్యాచరీల ధరల నిర్ణయంపై ప్రభుత్వ అజమాయిషీ
- నాణ్యమైన దాణాను వెటర్నరీ శాఖ నుంచి పంపిణీ చేయడం
- దాణా నాణ్యతను నిర్ణయించేందుకు తిరుపతిలోని వెటర్నరీ కళాశాల న్యూట్రీషియన్ శాఖకు అప్పగించడం
- కోళ్లకు సోకే వ్యాధులపై జంతువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ద్వారా పరీక్షలు
- కోడిపిల్లలను ఇచ్చే కంపెనీలే వాక్సినేటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం వంటి సూచనలను నివేదికలో పొందుపరిచారు.
మా పోరాటం ఇన్నాళ్లకు ఫలించనుంది..
కోళ్ల రైతుల కష్టాలపై చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఆయనకు సమస్యను విన్నవించాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి సమస్యను తెలుపగా ప్రభుత్వం కమిటీని వేసింది.
– విశ్వనాథరెడ్డి, జిల్లా కోళ్లరైతు సంఘ నాయకులు, పలమనేరు
హ్యాచరీల చేతుల్లో రైతులు కీలుబొమ్మలే..
హ్యాచరీలు నాణ్యతలేని కోడి పిల్లలనిచ్చినా, దాణా బాగా లేకున్నా రైతులు తీసుకోవాల్సిందే. కాదూ కూడదంటే పిల్లలను ఇవ్వరు. ఈ ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా.
– మల్లికార్జునరెడ్డి, కోళ్లరైతు, కీలపల్లి, గంగవరం మండలం
Comments
Please login to add a commentAdd a comment