సమయం : శనివారం వేకువజామున 1.55 కావొస్తోంది.
ప్రదేశం : చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలోని నరహరి ఆర్టీఓ చెక్‌పోస్ట్
గుడిపాల : ‘ఆ సమయంలో మంచు దట్టంగా కురుస్తోంది. చలి వణికిస్తోంది. నలిగి, మాసిపోయిన ఖాకీ చొక్కాలు, లుంగీలు కట్టుకుని, హవాయి చెప్పులు ధరించి ఉన్న ముగ్గురు చెక్‌పోస్టులోకి వెళ్లారు. వాళ్లను లారీ క్లీనర్లని విధుల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్ భావించారు. వారి చేతిలో ఆ క్లీనర్లు కొంత నగదు ఇచ్చి రోడ్డెక్కారు. ఇది తమకు ‘మామూలే’అన్నట్టు చూసి ఆర్టీఓ చెక్‌పోస్టు సిబ్బంది తిరిగి విధుల్లో మునిగిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఆ ముగ్గురు లారీ క్లీనర్లతో పాటు మరికొందరు అదే చెక్‌పోస్టుకు వచ్చారు.
కాకపోతే ఈసారి గెటప్ మారింది. చెక్‌పోస్టు సిబ్బందికి గుండె జారింది. వారి ముఖంలో ఒకింత ఆందోళన! సీన్ కట్ చేస్తే– లారీ క్లీనర్ల గెటప్‌లో వచ్చింది ఎవరో కాదు.. సాక్షాత్తు ఏసీబీ అధికారులే..!! ఆ గెటప్ బాగానే వర్కౌట్ అయినట్లు ఉదయం 6.30 వరకూ విస్తృతంగా చేసిన తనిఖీలు చెప్పకనే చెప్పాయి. చెక్‌పోస్టులో అక్రమంగా 71,970 రూపాయలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇక, ఉదయం వరకూ తనిఖీలు కొనసాగిస్తున్న సమయంలోనే అడపాదడపా కొందరు లారీ క్లీనర్లు, డ్రైవర్లు వచ్చి, చెక్‌పోస్టు సిబ్బంది అనుకుని నేరుగా ఏసీబీ అధికారులకే మామూళ్లు ఇవ్వడం కొసమెరుపు! అవినీతి నిరోధకశాఖ ఇన్‌స్పెక్టర్లు ఈశ్వర్, వెంకట్‌నాయుడు, ఏఎస్‌ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుళ్లు రవి, జ్యోతిప్రసాద్, బాబూసాహెబ్ ఈ దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ జనార్ధన్ నాయుడు ఈ వివరాలు వెల్లడించారు.
పలమనేరులో...
పలమనేరు: పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ ఆర్టీఓ కార్యాలయంపై తిరుపతి అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం దాడులు చేశారు. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ నాలుగు గంటలపాటు కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్‌లోని డాటాను పరిశీలించారు. డ్యూటీలోని ఎంవీఐలు శ్రీనివాసులు, ఆంజనేయప్రసాద్, సిబ్బందిని విచారణ చేశారు. అనధికారికంగా ఏదైనా సొమ్ము ఉన్నట్టు గుర్తించారా? అని ఏసీబీ డీఎస్పీ కంజక్షన్‌ను విలేకరులు సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ఇక్కడ రికార్డులు మాత్రమే పరిశీలించామని, దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment