పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి సముద్ర జలాలు, గాలి రొయ్యల లార్వా ఉత్పత్తికి, రొయ్య పిల్ల పెరుగుదలకు అనువుగా ఉండటంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా వందలాది హేచరీలు (రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) అభివృద్ధి సాధించాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో 314 హేచరీలు ఉండగా.. ఏటా ఇక్కడ 60 బిలియన్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు రొయ్య పిల్లలు (ష్రింప్ సీడ్) ఎగుమతి అవుతున్నాయి.
లక్ష మందికి ఉపాధి
హేచరీలు, రొయ్యల చెరువులు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కేవలం లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో హేచరీలో వివిధ పనులకు గాను సుమారు 150 మంది వరకు ఉపాధి పొందుతుండగా.. రొయ్యల చెరువుల నిర్వహణలో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది.
ఇక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో ఒక్కో యూనిట్‌లో 500 నుంచి 1000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వరకు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు ఐస్ ఫ్యాక్టరీలు, రవాణా ప్యాకింగ్ యూనిట్లలో వేలాది మందికి ఉపాధి కలుగుతోంది.
ప్రభుత్వ ప్రోత్సాహంతో పురోగమనం
రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి నాణ్యమైన మత్స్య సంపదను విక్రయించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. 10 ఎకరాలలోపు ఆక్వా చెరువులున్న రైతుల కు యూనిట్ కేవలం రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ అందిస్తోంది. 10 ఎకరాలకు పైబడి ఉన్న వారికి యూనిట్ విద్యుత్ రూ.3.85కే ఇస్తోంది. ఆక్వా ఎగుమతులు సక్రమంగా నిర్వహించడాని కి ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తోంది.
ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఆక్వా రైతులకు తగిన అండ లభిస్తోంది. దీంతో తీర ప్రాంతంలో రొయ్యల సాగు, హేచరీలు బాగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తులు గణనీయంగా పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహం దోహదం చేస్తోంది. – సత్యనారాయణ, జేడీ మత్స్య శాఖ, కాకినాడ
హేచరీలకు ఎల్‌టీ కేటగిరీగా మార్చాలి
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 314 వరకు హేచరీలు ఉన్నాయి. ఏటా 60 బిలియన్ల రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రొయ్యల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తీవ్ర ఇబ్బంది కలిగించగా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది.
హేచరీలకు విద్యుత్ వినియోగం చాలా అవసరం. గతంలో ఎల్‌టీగా ఉండే వాటిని హెచ్‌టీ చేయడం వల్ల అదనపు భారం పడింది. హేచరీలు 8 నెలలు పని చేస్తే 4 నెలలు మూతపడి ఉంటాయి. పని చేసే సమయంలో విద్యుత్ భారంగా మారగా పని చేయని సమయంలోనూ మినిమం బిల్లులు వేయడం వల్ల ఆర్థిక భారం పడుతోంది. – సత్తి వీర్రెడ్డి, అధ్యక్షుడు, ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్
Comments
Please login to add a commentAdd a comment