ఆక్వా ఉక్కిరి బిక్కిరి
- రొయ్యలు, చేపల రైతులకు గడ్డుకాలం
- వాతావరణంలో మార్పులతో అవస్థలు
- కరెంటు కోతలు.. తగ్గిన ధరలు
- పెరిగిన మేత.. సాగు వ్యయం
వాతావరణ మార్పులు.. కరెంటు కోతలు.. పెరుగుతున్న మేత ధరలు.. తగ్గిన రొయ్యలు, చేపల ధరలు.. వెరసి జిల్లాలోని ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. పెట్టుబడులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సరైన ధర దక్కక రొయ్యలు, చేపల రైతులకు గడ్డుకాలం వచ్చిపడింది. ఆశ నిరాశలు, ఆటుపోట్ల నడుమ జిల్లాలోని ఆక్వారంగం ఉక్కిరిబిక్కిరి అయ్యే దుస్థితి నెలకొంది.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో చేపలు, 65 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఇటీవల రొయ్యలు, చేపల సాగుకు మరింత డిమాండ్ పెరగడంతో వాటి లీజులు ఎకరానికి ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెరిగాయి. ప్రధానంగా కృష్ణా-గోదావరి జిల్లాల్లో సుమారు ఆరు లక్షల ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. ఈ రెండు జిల్లాల్లోను ఆక్వా ఉత్పత్తులు కైకలూరు, ఏలూరు, ఆకివీడు, నారాయణపురం, భీమవరం ప్రాంతాల నుంచి రోజువారీగా 300 లారీల్లో ఎగుమతులు జరుగుతుంటాయి. చేపలు, రొయ్యల సాగుకు చెరువుల లీజులు పెరగడంతో పాటు మేత ధరలు కూడా పెరగడంతో వాటికి సరైన ధరలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
సంక్షోభంలో చేపల సాగు...
జిల్లాలో చేపల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెండు నెలల క్రితం కిలో చేప రూ.90కి పైగా ధర పలికింది. ప్రస్తుతం చేప ధర కిలో రూ.75కి పడిపోయింది. దీంతో చేపల రైతులు నష్టాలకు గురవుతున్నారు. కిలో రూ.90 వరకు పలికిన ఫంగస్ చేపలు ఇప్పుడు సగానికి పడిపోయి కేవలం రూ.45 మాత్రమే పలుకుతున్నాయి. ఇదే సమయంలో లారీ (పది టన్నులు) తవుడు ధర రూ.1.10 లక్షలకు పెరిగింది. దీంతో చేపల రైతులు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది.
రొయ్య రైతు విలవిల..
కష్టనష్టాలు, ఆటుపోట్లతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. 40 పైసలు ఉండే రొయ్య పిల్ల ధర దారుణంగా దిగజారి ఏకంగా 8 పైసలకు పడిపోయింది. ఎకరానికి లక్ష రొయ్య పిల్లలను వేసే దశలోనే పెట్టుబడి రెట్టింపు అయ్యింది. దాదాపు నాలుగు నెలల పాటు కంటికి రెప్పలా రొయ్యలసాగు చేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఇదే సమయంలో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ బ్యాలెన్స్ కోసం ఎకరానికి కనీసం రెండు సెట్లు ఏరియేటర్లు తిప్పాల్సి ఉంటుంది. దీంతో రూ.25 వేలు పలికిన ఏరియేటర్ల ధర ఇప్పుడు రూ.45 వేలకు పెరిగింది. రొయ్యల మేత ధర టన్ను రూ.75 వేలు పలుకుతోంది. టన్ను రొయ్యల ఉత్పత్తికి టన్ను మేతను వేయాల్సి రావడంతో పెట్టుబడులు రాక ఆక్వా రైతు కుదేలవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితిలో రొయ్యల రైతులు టన్ను రొయ్యల ఉత్పత్తికి రూ.40 వేల వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడంతో తలకు మించిన భారం అవుతోంది. ఇంత చేసినా నష్టాల సాగు మాత్రమే మిగులుతోంది.
కరెంటు కోతలతో నష్టాల వాత..
ఒకవైపు వాతావరణం రొయ్యల రైతులను కలవరపెడుతోంది. మరోవైపు కరెంటు కోతలు వారిని నష్టాలకు గురిచేస్తున్నాయి. మారుతున్న వాతావరణంతో రొయ్యలకు ఆక్సిజన్ లోపం తలెత్తుతోంది. ఉక్కపోతతో ఊపిరాడక రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో ఏరియేటర్లు తిప్పేందుకు కరెంటు కోతలు ప్రధాన సమస్యగా మారాయి. దీంతో ఆయిల్ ఇంజన్‌ల సాయంతో ఏరియేటర్లను తిప్పడం అనదపు భారంగా మారింది. మరోవైపు ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయే ప్రమాదం రావడంతో మధ్యలోనే వాటిని పట్టుబడి పడుతున్నారు. రొయ్యలు, చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేద్దామంటే అవి దెబ్బతినకుండా ప్యాకింగ్ చేసేందుకు ఐస్ కొరత వచ్చిపడింది. కరెంటు కోతలతో ఐస్ ఉత్పత్తి నిలిచిపోయి, కూలీల కొరత వచ్చి ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినే దుస్థితి నెలకొంది. గత రెండు నెలలతో పోల్చితే రొయ్యల ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి కౌంట్‌కు ధరలో తేడాతో రొయ్యల రైతులు దగాపడుతున్నారు.
పంట చేతికొచ్చేటప్పటికి రేట్లు తగ్గుతున్నాయ్
లక్షల్లో పెట్టుబడులు పెట్టి రొయ్యలసాగు చేపడుతుంటే ధరలు ఒక్కసారిగా పడిపోవటంతో రైతులు నష్టపోతున్నారు. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గిస్తున్నా రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదే విధంగా ధరలు ఉంటే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే.
- కట్టా గోపి, రైతు, గొల్లగూడెం, కలిదిండి మండలం
కష్టాల్లో ఆక్వా రంగం
ఆక్వా రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సాగు చేపడుతున్నాను. వాతావరణంలో మార్పుల వల్ల ప్రతిసారి నష్టపోవలసి వస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో రొయ్యల ధరలు దిగజారటంతో నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాం. టైగర్ రొయ్య ఆశలు చూపించటంతో సాగు చేపట్టి ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం వనామిపై పెట్టుకున్న ఆశలు అడియాసలవుతున్నాయి.
- ఎ.దుర్గారావు, మట్టగుంట ఆక్వా రైతు, కలిదిండి మండలం